KCR: సోయిలేని తనంతోనే తెలంగాణ ఆగం

Published 2024-07-04 21:33:30

postImages/2024-07-04/1720109010_goreti.jpg

న్యూస్ లైన్ డెస్క్: సోయిలేని తనంతోనే మొదటినుంచీ తెలంగాణ ఆగం అయ్యిందని కవి గోరటి వెంకన్నతో నాటి ఉమ్మడి రాష్ట్రంలోని దుర్భర పరిస్థితులను  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వివరించారు. తమ హక్కులను కాపాడుకునే దిశగా ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపడంలో కవులు రచయితలు ముందుండాలని కేసీఆర్ తెలిపారు. తెలంగాణకు న్యాయంగా దక్కవలసిన నదీ జలాల వాటాను సాధించుకోవడంలో ఉమ్మడి రాష్ట్రంలో నాటి ఆంధ్రా నాయకత్వ స్వార్థంతో పాటు, తెలంగాణ నాయకత్వం అనుసరించిన నిర్లక్ష్య ధోరణి సోయిలేని తనం ప్రధాన కారణాలుగా మారి తెలంగాణ రైతాంగానికి దశాబ్దాల పాటు నష్టాన్ని కలిగించిందని కేసీఆర్ అన్నారు. 

విద్యుత్, వ్యవసాయ రంగంలో తెలంగాణకు ఉద్దేశపూరిత ద్రోహాలను పసిగట్టడంలో నాటి తెలంగాణ నాయకత్వ చైతన్య రాహిత్యం రైతాంగానికి తీరని శాపంగా మారిందన్నారు. అటువంటి సంక్లిష్ట పరిస్థిలోంచి తెలంగాణ సమస్యలను అర్థం చేసుకొని కవులు కళాకారులు మేధావుల సాహిత్య సాంస్కృతిక ప్రక్రియ ఒకవైపు టీఆర్ఎస్ రాజకీయ ప్రక్రియ మరోవైపు జమిలిగా సాగి భావజాల వ్యాప్తి చేస్తూ ప్రజలకు అర్థం చేయించి ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ సాధించగలిగామని కేసీఆర్ వివరించారు. స్వరాష్ట్ర సాధన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఆరు దశాబ్దాల పాటు జరిగిన నష్టాలను సరిదిద్దుకుంటూ ఒక్కొక్కటిగా సవరించుకుంటూ తెలంగాణ అస్తిత్వ గరిమను నిలుపుకుంటూ దేశానికే ఆదర్శవంతమైన ప్రగతిని అందించడానికి పదేండ్ల పాలనాకాలాన్ని ప్రణాళికా బద్ధంగా సద్వినియోగం చేసుకున్నామన్నారు. ఎంతో సహనంతో దార్శనికతతో శాంతియుత పంథాలో చాతుర్యంతో ఉద్యమకాలం నుంచి నిన్నటిదాకా సాగిన రెండున్నర దశాబ్దాల ఈ మొత్తం ప్రక్రియను రాగద్వేషాలకు అతీతంగా తెలంగాణ ఆత్మతో లోతుగా అర్థం చేసుకుంటూ సూక్ష్మ దృష్టి తో పరిశీలించినప్పుడు మాత్రమే బోధపడుతుందని కేసీఆర్ తెలిపారు.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రజా వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న గురువారం నాడు ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి కవిత్వ పుస్తకాలను కేసీఆర్‌కి అందజేశారు. అనంతరం సాగిన ఇష్టాగోష్టి సమావేశంలో తెలంగాణ సాహిత్యం సంస్కృతి రాజకీయాలు తదితర అంశాలపై చర్చించారు. ప్రపంచ నాయకత్వానికి దీటుగా శాంతియుత పద్దతిలో కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం సాగిందని, దేశానికే ఆదర్శంగా పదేండ్ల కేసీఆర్ పాలన సాగిందనీ గోరెటి వెంకన్న తనదైన సాహిత్య శైలిలో వివరించారు. అదే సందర్భంలో సీనియర్ జర్నలిస్టు వర్దెల్లి వెంకన్న తన పిట్ట వాలిన చెట్టు పుస్తకాన్ని కేసీఆర్‌కి అందించారు. ఈ సందర్భంగా పుస్తకాన్ని పరిశీలించిన కేసీఆర్ వర్దెల్లిని అభినందించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు  మధుసూదనాచారి, శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.