TG:కాంగ్రెస్ పాలనకు అధిష్టానమే వణుకుతుందా..ఎన్నికలున్న రాష్ట్రాల్లో ఓటమి తప్పదా.?

కాంగ్రెస్ పార్టీకి కొత్త భయం పట్టుకుందట. రాష్ట్రంలోని గొడవలు ఇప్పుడు అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయట. కొద్దిరోజులుగా రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా జరుగుతున్న


Published Sep 18, 2024 08:13:09 AM
postImages/2024-09-18/1726627389_rahulhead.jpg

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ పార్టీకి కొత్త భయం పట్టుకుందట. రాష్ట్రంలోని గొడవలు ఇప్పుడు అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయట. కొద్దిరోజులుగా రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా జరుగుతున్న పంచాయతీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎఫెక్ట్ చూపిస్తోందని ఢిల్లీ హైకమాండ్ టెన్షన్ పడుతోందట. పాడి కౌశిక్ రెడ్డిపై దాడి విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోందట. రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ అరాచకాలను దేశమంతా తిరిగి చెబుతామని హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాలలో తిరిగి కాంగ్రెస్ మోసాల గురించి, ఆరు గ్యారంటీల గారడీ, రాహుల్ గాంధీ చేస్తున్న మోసం గురించి చెబుతామని హరీష్ రావు హెచ్చరించారు. దీంతో హస్తం నేతలు టెన్షన్ పడుతున్నారట. 

రాష్ట్రంలో జరిగే పరిస్థితులను హరీష్ రావు దేశమంతా ప్రచారం చేస్తామని చెప్పడంతో కాంగ్రెస్ గుబులు పడుతోందట. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేకపోయింది. 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి... అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటినా కనీసం సగం కూడా అమలు చేయలేదనే అపవాదును మూటగట్టుకుంది. పెన్షన్లు పెంచకపోవడం, ఉచిత కరెంటు, రూ.500కే గ్యాస్ సిలిండర్, రైతుభరోసా, మహిళలకు ప్రతీ నెల రూ.2500 ఇవ్వకపోవడం వంటి అంశాలు హస్తం నేతలను ఆగమాగం చేస్తున్నాయట. అందరికి రుణమాఫీ చేస్తామని చెప్పి కొందరికే చేసింది కాంగ్రెస్ సర్కారు. ఎన్నికల ముందు రూ.40వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి,  కేబినెట్ లో రూ.31వేల కోట్లు అంటూ మాట మార్చింది. తీరా రుణమాఫీ చేసే సమయానికి వచ్చే సరికి అది రూ.18వేల కోట్లకే పరిమితమైంది.

 రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకపోవడం, పెరిగిన అత్యాచారాలు, క్రైమ్ రేట్ తో పాటు గత కొంతకాలంగా శాంతిభద్రతలు సైతం అదుపులో లేకుండా పోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఇటీవల కాలంలో నిజాలు చూపిస్తున్న జర్నలిస్టులపై దాడులు, పరామర్శకు వెళ్లిన మాజీ మంత్రుల కాన్వాయ్ లపై దాడులు, ఎమ్మెల్యేల ఇండ్లపై రాళ్ల దాడి వంటి ఘటనలను సైతం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో అక్కడి ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధం అవుతోందట. ఇప్పటి వరకు తాము తెలంగాణలో అద్భుతంగా పనిచేశామని చెప్పుకుని మిగిలిన రాష్ట్రాల ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసుకుందట. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు నిజంగానే ఆయా రాష్ట్రాలకు వెళ్లి అసలు విషయాన్ని చెబితే.. అక్కడ తమ పరిస్థితి ఏంటనే భయం పట్టుకుందట. హామీలన్ని బోగస్ అనే విషయం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు చేరితే హస్తానికి భారీ ఎదురుదెబ్బతప్పదని ఢిల్లీ పెద్దలు కూడా ఆందోళనపడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు..

బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కొద్దిమేర క్యాడర్ ఉండటం హస్తం పార్టీ హస్తిన పెద్దలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోందంటున్నారు. ఈ డ్యామేజ్ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రస్తుతం కాంగ్రెస్ పెద్దలు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ ఆయా రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేస్తే.. ఖచ్చితంగా హస్తానికి భారీ ఎదురుదెబ్బతప్పదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : revanth-reddy news-line brs congress rahul-gandhi harishrao padi-kowshikreddy

Related Articles