Osmania Hospital: ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్.. ఎక్కడికో తెలుసా?

సచివాలయంలో స్పీడ్‌ (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.


Published Aug 27, 2024 09:50:30 AM
postImages/2024-08-27//1724759799_osmaniageneralHospital.jpg

న్యూస్ లైన్ డెస్క్: సచివాలయంలో స్పీడ్‌ (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్‌కు తరలించాలని అధికారులకు ఆదేశించారు. గోషామహల్ సిటీ పోలీస్ అకాడమీకి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని తెలిపారు. ఈ తరలింపునకు సంబంధించిన భూ బదలాయింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు.

వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆసుపత్రి నిర్మాణానికి అనుభజ్ఞులైన ఆర్కిటెక్టులతో డిజైన్లు రూపొందించాలని సీఎం ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అక్కడికి చేరుకునే కనెక్టింగ్ రోడ్లను అభివృద్ధి చేయాలని, ఆసుపత్రి చుట్టూ నలు దిశలా రోడ్డు ఉండేలా డిజైన్ చేయాలని చెప్పారు. 

ఆసుపత్రికి అవసరమైన అన్ని విభాగాలతో పాటు అకడమిక్ బ్లాక్, నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్లు కూడా నిర్మించేలా ప్రణాళికలు ఉండాలని చెప్పారు. కార్పొరేట్ తరహాలో వైద్య విభాగాలు, సేవలన్నీ అక్కడే అందుబాటులో ఉండాలని సూచించారు. ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ భవనాలను చారిత్రక కట్టడాలుగా పరిరక్షించే బాధ్యతను చేపడుతామని సీఎం చెప్పారు. మూసీ రివర్ డెవెలప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా అక్కడున్న భవనాలను పర్యాటకులను ఆకట్టుకునే చారిత్రక భవనాలుగా తీర్చిదిద్దుతామని అన్నారు.

గోషామహల్ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించినందుకు పోలీసు విభాగానికి ప్రత్నామ్నాయ స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పేట్లబుర్జులో ఉన్న పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్, సిటీ పోలీస్ అకాడమీ, చుట్టూ ఉన్న స్థలాన్ని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇతర అధికారులు పాల్గొన్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana cm-revanth-reddy meet gandhi-hospital goshamahalmla

Related Articles