నిరుద్యోగులను నిర్బంధిస్తూ.. జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శిస్తే కేసులు పెట్టడం, ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత నేతన్నల ఆత్మహత్యలు, ఆటో అన్నల బలవన్మరణాలు కనిపిస్తున్నాయని అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ పాలనలో గ్యారంటీలకు టాటా, లంకె బిందెల వేట తప్ప ఏమీ లేదని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్‌లు ఢీలా పడిపోయాయని, దాన్ని మరిపించడానికి డైవర్షన్ చేస్తున్నారని విమర్శించారు.
హామీల పత్రాలను పాతర పెట్టి, శ్వేతా పత్రాలతో జాతర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులను నిర్బంధిస్తూ.. జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శిస్తే కేసులు పెట్టడం, ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత నేతన్నల ఆత్మహత్యలు, ఆటో అన్నల బలవన్మరణాలు కనిపిస్తున్నాయని అన్నారు.
రేవంత్ రెడ్డికి కేసీఆర్ భయం పట్టుకుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అందుకే ప్రతి సారి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని అంటున్నారని వెల్లడించారు. కేసీఆర్ అంటే చెరపలేని, తుడిచేయలేని జ్ఞాపకమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సంపద 2014లో 4 లక్షల కోట్ల నుండి 2024లో 14 లక్షల కోట్లకు పెరిగింది అని కాంగ్రెస్ ప్రభుత్వమే ఒప్పుకుందని ఆయన తెలిపారు.
మంచి బడ్జెట్ పెట్టినందుకు తమను అభినందిస్తారని అనుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎందుకు అభినందించాలని కేటీఆర్ ప్రశ్నించారు. హామీలు అమలు చేయనందుకు అభినందించాలా.. లేక డిక్లరేషన్లకు దిక్కు లేనందుకా? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో రీకాల్ సిస్టం లేదు కాబట్టి మరో నాలుగేళ్లు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భరించక తప్పదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
భట్టి విక్రమార్క ఇచ్చిన తెలంగాణ సోషియో ఎకనామిక్ బుక్‌లో మన సంపద 2014లో రూ.4 లక్షల కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ.14 లక్షల 64 వేల కోట్లకు పెరిగిందని చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే No.1గా బుక్‌లో ఉందని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు మించిన ప్రాధాన్యత ఇంకేమీ ఉండదని.. అందుకే రాత్రి 12 గంటల వరకు అసెంబ్లీ సమావేశాన్ని కొనసాగించి సరైన బిల్లుని ప్రవేశపెట్టాలని కేటీఆర్ కోరారు. ద్రవ్య వినియోగ బిల్లు చాలా ముఖ్యమైన అంశమని ఆయన అన్నారు. దీనిమీద రాత్రి 12 గంటల వరకు చర్చించి, బిల్ పాస్ చేద్దామని అన్నారు. గవర్నర్ ప్రమాణస్వీకారం ఉందని మధ్యాహ్నం 3 గంటలకే సభను ముగించే ప్రయత్నం చేయొద్దని కేటీఆర్ కోరారు.