ఇప్పటి వరకు కవిత నుంచి ఆ డబ్బును ఎందుకు రికవరీ చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: BRS ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన కవిత గత ఐదు నెలలుగా తీహార్ జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే. జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్ బెంచ్ విచారణ జరుపుతోంది. కవిత తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదిస్తున్నారు.
ఈడీ కేసులో కవిత గత ఐదు నెలలుగా జైల్లోనే ఉన్నారని రోహత్గీ తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 493 మంది సాక్షులను విచారించారని ఆయన వెల్లడించారు. ఒక మహిళగా కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని ఆయన అన్నారు. కవిత మహా ఎంపీ అని.. జైలు నుంచి బెయిల్ ఇచ్చినా ఆమె ఎక్కడికీ వెళ్లరని తెలిపారు.
రూ.100 కోట్ల ముడుపులు అనే ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన అన్నారు. ఒక వేళ అదే నిజం అయితే.. ఇప్పటి వరకు కవిత నుంచి ఆ డబ్బును ఎందుకు రికవరీ చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. సాక్షులను బెదిరించారని ఆరోపించారు. కానీ, ఎక్కడ కూడా కేసులు నమోదు కాలేదని అన్నారు. ఇదే కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందని గుర్తుచేశారు. సిసోడియాకు వర్తించిన నిబంధనలే కవితకు కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఈడీ, సీబీఐ అడిగిన ఫోన్లను కూడా కవిత అప్పగించారని రోహత్గీ ధర్మాసనానికి తెలిపారు.