assigned lands: తమ్ముడు కొండ.. అసైన్డ్ దందా..!

 అసైన్డ్ భూములను, పోరంబోకు భూములను వెతికి మరీ కొనుగోళ్ళు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆరుట్ల, మంచాల, బొంగుళూరు గేట్, తుక్కుగూడ, కొంగరకలాన్, కందుకూరు, ఫార్మాసిటీ పరిసరాలను జల్లెడ పడుతూ ఆయా భూముల చిట్టాలను సేకరిస్తూ వాటిని కొంటుందట ఈయన టీమ్.


Published Jun 25, 2024 03:55:56 AM
postImages/2024-06-25/1719303741_Untitleddesign8.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రభుత్వంలో 'తమ్ముడు రెడ్డి' అనధికార పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. షాడో మినిస్టర్‌గా ఆయన తన పని తాను కానిచ్చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా కాన్వాయ్‌ను తలపించే వాహనశ్రేణి, మందీమార్బలం ఆయనకు ఉంటాయి. పెద్ద తలకాయ నీడలో తమ దందాలను మాత్రం చాలా పకడ్బందీగా చేసుకుపోతున్నారు. తాజాగా ఆయన దందాలకు సంబంధించి ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. అసైన్డ్ భూములను, పోరంబోకు భూములను వెతికి మరీ కొనుగోళ్ళు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆరుట్ల, మంచాల, బొంగుళూరు గేట్, తుక్కుగూడ, కొంగరకలాన్, కందుకూరు, ఫార్మాసిటీ పరిసరాలను జల్లెడ పడుతూ ఆయా భూముల చిట్టాలను సేకరిస్తూ వాటిని కొంటుందట ఈయన టీమ్. దీనికి స్థానిక రియల్టర్లు, రెడ్డి వర్గం సహకరిస్తున్నట్టుగా సమాచారం. పేదలకు పంచిన అసైన్డ్ భూములను ఇలా అక్రమంగా కొనుగోలు చేయడం వెనక పెద్ద బాగోతమే ఉంది. అదేంటో చెప్పే ముందు నాలుగు మాటలు.

అసలు అసైన్డ్ భూములనేవి ప్రజల ఉమ్మడి ఆస్తి. అవి ఎప్పటికీ ఒకరి పరం కాగూడదు. అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కూడా. ఎవరైతే జీవనోపాధికి దూరంగా ఉంటారో, అలాంటి వారికి ఈ భూములలో సాగుకు అవకాశం కల్పిస్తూ నాటి ప్రభుత్వాలు పేదలకు పంచుతూ వచ్చాయి. వీటిని సదరు రైతు అమ్మకూడదు. కేవలం సాగు మాత్రమే చేసుకోవాలి. అయితే రానురాను ఓటు బ్యాంకు రాజకీయాలు పెరగడంతో హామీల చిట్టా కూడా పెరుగుతూ వచ్చింది. అసైన్డ్ ల్యాండ్స్‌ను అమ్ముకునే అవకాశం కల్పిస్తామంటూ హామీలు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. రాష్ట్రంలో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఈ విషయాన్నే పేర్కొని, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. దీనిపై రేపో, మాపో కసరత్తు మొదలుపెట్టి, అసైన్డ్ భూముల చట్టానికి సవరణలు చేస్తుంది. అమ్ముకునే అవకాశం కల్పిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇది పైకి పేదలకు లాభం చేకూర్చేలా కనపడుతున్నా.. దాని వెనక పెద్ద భూదందానే దాగుంది. దీనివల్ల లాభం పొందేది మళ్లా పెత్తందారులు, రియల్టర్లు మాత్రమే. 

ఇప్పుడు మళ్లీ అసలు విషయానికి వస్తే.. కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీనే ఆ తమ్ముడు రెడ్డి చాకచక్యంగా వినియోగించుకుంటున్నారు. అసలే రియల్ ఎస్టేట్ రంగంలో అపారమైన అనుభవం ఉన్న ఆ తమ్ముడు.. తమ తెలివితేటలకు పదును పెట్టి మరీ ఈ దందాలో కోట్లు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారట. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న భూములను భూతద్దంలో వెతుకుతూ, ఎక్కడ అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడికి తన మనుషులను పంపుతూ దందా సాగిస్తున్నారు. ఎవ్వరూ కొనని భూమిని కొంటామంటూ పేదలను మభ్యపెడుతూ వారికి డబ్బు ఆశచూపుతూ తమ పని కానిచ్చేస్తున్నారు. తమ్ముడు రెడ్డికి ‘రెవెన్యూశాఖ రెడ్డి’ అధికారులు సైతం బాగా సహకరిస్తున్నట్టుగా సమాచారం. దందాలో రెడ్లను మాత్రమే “తమ్ముడు రెడ్డి” నమ్ముతున్నారట. ఇప్పుడు వాటిని కొని, రేపు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అమ్ముకోవడం మొదలుపెడుతుంది. లక్షల్లో భూములు కొని, కోట్లలో వాటిని అమ్ముకొనేందుకు చూస్తోంది తమ్ముడు రెడ్డి టీమ్.  

ఇప్పటికే పల్లెటూర్లలో రెడ్డి గారి బృందం విస్తృతంగా పర్యటిస్తూ అసైన్డ్ భూములపై ప్రచారం చేసుకుంటూ పోతోంది. ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా, ఎలాంటి లిటికేషన్ ఉన్నా.. కొనేస్తామంటూ చెబుతుండటంతో కొంతమంది ఈజీగా వారి వలకు చిక్కుతున్నారు. రెండు మూడు తరాలుగా అనుభవిస్తున్న భూములను అమ్మేసుకుని, తమ జీవనాధారాన్ని కోల్పోయే ప్రమాదంలో పడుతున్నారు. తమ్ముడి రెడ్డి వందల కోట్ల రూపాయల భూదందా తెలిసి కేబినెట్‌లో మిగిలిన మంత్రులు షాక్ అవుతున్నారట. తమకెందుకు ఈ ఆలోచన రాలేదని గుసగుసలాడుకుంటున్నారట. వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదన్నట్టుగా తమ్ముడు రెడ్డి తన అసైన్డ్ దందాను మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిస్తున్నట్టు తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : telangana revanth-reddy news-line newslinetelugu tspolitics orr assigned-lands

Related Articles