సరైన నిర్వహణ లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం ఈ హాస్టల్ దుస్థితికి కారణమని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అద్దె భవనమైనా చూసి విద్యార్థులను అందులోకి చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: బోధించు, సమీకరించు, పోరాడు.. అన్నారు అంబేద్కర్. అట్టడుగువర్గాలలో చైతన్యం నింపడానికి ఆయన బోధన అనే మార్గాన్ని ఎంచుకున్నారు. వ్యవస్థలోని సకల అవలక్షణాలను దూరం చేసి, ఉన్నత స్థాయికి తీసుకు వెళుతుందని ఆయన ఆశించారు. ఆ ఆశయ సాధన కోసం.. మూడు దశాబ్దాల క్రితం మునుగోడు(Munagod)లో ఎస్సీ బాయ్స్ హాస్టల్(hostel) నిర్మాణం అయ్యింది.
వందలాది మంది విద్యార్థులు ఆ చదువులమ్మ నీడలో వసతి పొందుతూ, అక్షరాలు దిద్ది, తమ జీవితాల్లో వెలుగులు నింపుకున్నారు. అంతటి గొప్ప విద్యాలయం నేడు శిథిలావస్థకు చేరుకుంది. పెచ్చులూడే స్లాబులతో ఆందోళనకర దుస్థితిలో ఉంది. వర్షం పడిందంటే భయంతో పరుగులు పెట్టే పరిస్థితి నెలకొంది. ఇక్కడి వాతావరణాన్ని చూసి తల్లిదండ్రులు తమ పిల్లలను ఇళ్లకు తీసుకు పోతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని తెలిసి కూడా పునర్నిర్మాణం చేపట్టకపోవడం ఏంటని మండిపడుతున్నారు.
1993 సంవత్సరంలో నిర్మించిన ఈ వసతి గృహంలో ఏటా 150 మందికి పైగా విద్యార్థులు ఉండేవారు. రాను రాను ఇక్కడ 40కి మించి విద్యార్థులు ఉండటం లేదు. సరైన నిర్వహణ లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం ఈ హాస్టల్ దుస్థితికి కారణమని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అద్దె భవనమైనా చూసి విద్యార్థులను అందులోకి చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నియోజకవర్గం సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(komatireddy Rajagopal reddy)పై విద్యార్థి సంఘాల నేతలు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. గత రెండు పర్యాయాలుగా మునుగోడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న ఆయన.. ప్రజానాయకుడిగా చెప్పుకోవడమే కానీ, చేసింది ఏమీ లేదని విమర్శిస్తున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న ఆయన, ఇప్పుడు అధికారంలో ఉన్నారని, ఇప్పుడైనా హస్టల్ పునర్నిర్మాణం చేపట్టాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.