రుణమాఫీ కాలేదని ఓ రైతు అగ్రికల్చర్ ఆఫీసులో ఆత్మహత్య చేసుకున్నాడు.
న్యూస్ లైన్ డెస్క్: రుణమాఫీ కాలేదని ఓ రైతు అగ్రికల్చర్ ఆఫీసులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీంతో రైతు ఆత్మహత్య కలకలం రేపుతుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలానికి చెందిన రైతు సురేందర్ రెడ్డి(52) తనకున్న రెండు ఎకరాల పొలం మీద తీసుకున్న రుణం మాఫీ కాలేదని, ఆ బాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రుణమాఫీ జరగలేదని రైతు సురేందర్ రెడ్డి అగ్రికల్చర్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్న ఇప్పటివరకు 20 శాతం కూడా రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే తమకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.