అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలుడు పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం పై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలుడు పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం పై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి, వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ఇప్పటికే యంత్రాంగాన్ని ఆదేశించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. కడప అగాడి వీధిలో వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి తన్వీర్(11) అనే చిన్నారి మృతి చెందిన ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసింది. విద్యుదాఘాతంతో గాయపడిన మరో విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.
అచ్యుతాపురం సెజ్ లోని రియాక్టర్ పేలుడు ఘటనలో ఇప్పటివరకు 14 మంది మృతి చెందారు. పేలుడు ధాటికి చెల్లాచెదురుగా మృతదేహాలు పడిపోయాయి. మరో 25 మందికి గాయాలు కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమం ఉండగా.. రియాక్టర్ పేలుడు ధాటికి పరిశ్రమ భవనం దెబ్బతింది. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఎసైన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో 3 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. శిథిలాల తొలగింపు కోసం భారీ క్రేన్లు అధికారులు తెప్పించారు.