Harish rao: నిరుద్యోగుల తరఫున BRS పోరాటం చేస్తుంది 2024-06-30 13:52:31

న్యూస్ లైన్ డెస్క్: నిరుద్యోగుల తరఫున BRS పోరాటం చేస్తుందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish rao) అన్నారు. ఆదివారం గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రి(Gandhi hospital)లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్‌ను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల తరుపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీని స్తంభింప చేస్తామని హెచ్చరించారు. 

సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి మోతీలాల్ నాయక్‌తో మాట్లాడాలి, వారి సమస్యలు పరిష్కరించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులతో చర్చ జరపాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాకా నిరుద్యోగులు తరఫున BRS పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఎంతవరకైనా తెగించి కొట్లాడుతుందని అన్నారు.

 నిరుద్యోగ యువతీ యువకులకు BRS పూర్తి అండగా ఉంటుందని తెలిపారు. మోతీలాల్ నాయక్ దీక్ష విరమించాలని మీడియా సాక్షిగా విజ్ఞప్తి చేస్తున్నానని హరీష్ రావు అన్నారు. కలిసి ప్రభుత్వంపై పోరాటం చేద్దామని హరీష్ రావు పిలుపునిచ్చారు.  మోతీలాల్‌కు ఏం జరగక ముందే ప్రభుత్వం తక్షణ స్పందించాలని డిమాండ్ చేశారు. అతని ఆరోగ్యం పట్ల ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.