బీఆర్‌ఎస్ నాయకుల వాహనాలపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడులకు పాల్పడటం హేయనీయం అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ఖమ్మం వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, ఇతర బీఆర్‌ఎస్ నాయకుల వాహనాలపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడులకు పాల్పడటం హేయనీయం అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఈ దాడిని పార్టీలకతీతంగా ఖండించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయనే సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. తత్ఫలితంగానే ఖమ్మం ప్రజలకు ఈ విపత్కర పరిస్థితి దాపురించిందని ఈ ఆయన విమర్శించారు.
ఈ ఆపత్కాల సమయంలో పార్టీలకతీతంగా రాష్ట్ర ప్రజలకు చేదోడు వాదోడుగా నిలవాలని సంకల్పించిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఖమ్మంలో పర్యటించారని, అందులో భాగంగానే వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారన్నారు. ఇదిచూసి ఓర్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ పార్టీ నాయకులపై రౌడీ మూకలను ఉసిగొల్పిందని, వారితో దాడులకు తెగపడ్డదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సాయం చేయడం చేతకాకపోగా, సాయం చేసేవాళ్లపై దాడులకు ఉసిగొల్పడం కాంగ్రెస్ ప్రభుత్వ అసహనాన్ని, అసమర్థతను తెలియజేస్తుందని అన్నారు. ఈ దాడిపై ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ దాడుల వెనుక ఎంతటివారున్నా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డిని ఈ సందర్భంగా వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.