కాంగ్రెస్ బీజేపీలకు చెరో ఎనిమిది ఎంపీ సీట్లు గెలిపిస్తే తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ బీజేపీలకు చెరో ఎనిమిది ఎంపీ సీట్లు గెలిపిస్తే తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మంగళవారం సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర, కోవా లక్ష్మి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవితో కలిసి తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కేంద్ర తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు అన్నారు. బుధవారం పార్లమెంటులో కాంగ్రెస్, బీజేపీ ఎంపీ లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని ఆయన కోరారు. ఇక బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన మూడు గంటల పాటు జరిగిందని, శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూధన చారిని ఏక గ్రీవంగా ఈ సమావేశంలో ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ ఎల్పీ మిగతా కార్యవర్గాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు.
ఈ నెల 25న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత అదే రోజూ మేడి గడ్డ పర్యటనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం బయలు దేరుతుందని పేర్కొన్నారు. ఈ నెల 26న మేడి గడ్డ కన్నెపల్లి పంప్ హౌజ్ ను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం సందర్శిస్తుందన్నారు. లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలో వృధాగా పోతున్నా ఈ ప్రభుత్వం పంపుల ద్వారా నీళ్లు ఎత్తిపోయడం లేదన్నారు. మిడ్ మానేరు, కొండ పోచమ్మ సాగర్, రంగ నాయక సాగర్ లలో నీళ్లు నింపి రైతుల పొలాలకు తరలించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతామన్నారు. ప్రజా సమస్యలను లేవ నెత్తేందుకు ఎల్పీ సమావేశంలో కార్యాచరణ ఖరారు చేశామని హరీష్ రావు అన్నారు. నిరుద్యోగుల సమస్యలపై రేపు చర్చ కోసం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో పాల్పడ్డ కుంభ కోణాలపై అసెంబ్లీలో నిలదీస్తామన్నారు.