బీఆర్ఎస్ యువ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
న్యూస్ లైన్ డెస్క్: బీఆర్‌ఎస్ యువ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన మేము ఉన్నామని నమ్మకం ఇవ్వడానికి భరోసా ఇవ్వడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మన చేవెళ్లకు వచ్చారని ఆయన అన్నారు. గత ఎనిమిది నెలల్లో కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతాంగం, వ్యవసాయం, రైతులు ఎంత మోసపోయారో ఎంత దగాపడ్డారో మీకు అందరికీ తెలుసు అని అన్నారు. అధికారంలో రాకముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తానని చెప్పి మొదటిసారి మోసం చేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలతో పాటు ఏకధాటిగా రెండు లక్షల వరకు రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి మల్ల మాట తప్పి రెండవసారి మోసం చేశారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. ఇక ప్రజల దగ్గరికి వెళితే ఓట్లు పడవు కాంగ్రెస్ పార్టీ మోసం దొరికింది ప్రజలు ఇక మనల్ని నమ్మేటట్లు లేరని ముఖ్యమంత్రి రేవంత్ ఊళ్ళల్లో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్లు వేసి పంద్రాగస్టులోగా 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మూడవసారి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు మోసం చేస్తారని ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తారు. ఇంకా ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ రైతులను, తెలంగాణ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని మోసం చేస్తుందని కార్తీక్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.