Niranjan Reddy: మార్గదర్శకాలు కావు.. మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు

కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


Published Jul 15, 2024 08:10:28 AM
postImages/2024-07-15/1721046682_rythu.PNG

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయం, రైతాంగం బాగుండాలని, తద్వారా విరివిగా ఉపాధి అవకాశాలు లభించాలని కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత కరెంటు, సాగునీళ్లు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ పథకాలకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ రంగాల కష్ట, నష్టాల మూలంగా అనేకమంది రైతులు ప్రాణాలను కోల్పోయారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ రైతులు, వ్యవసాయమే ఇరుసుగా పనిచేశాయి అని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పడిన రైతుల రుణభారాన్ని తొలగించడం మూలంగానే రైతు కుదుటపడతాడు, వ్యవసాయం సుస్థిరం అవుతుందని భావించి కేసీఆర్ రెండు విడతలుగా రుణమాఫీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. మొదటి విడతలో 35.31 లక్షల మంది రైతులకు రూ. 16,144 కోట్లు రుణమాఫీ చేశారు. రెండో విడతలో 22.98 లక్షల రైతులకు చెందిన రూ.13,000 కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చే వరకు కేసీఆర్ ప్రభుత్వంలో మిగిలిపోయింది రూ. 6440 కోట్లు మాత్రమే అని అన్నారు. మొత్తం రెండు విడతలలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 29,144 కోట్లు రుణమాఫీ చేసిందని, అయితే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం అసలు రైతులకు రుణాలే మాఫీ చేయనట్లు కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఇలా ఎన్నికలు అయిపోగానే అలా డిసెంబరు 9న రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో ఉన్న 69 లక్షల పైచిలుకు ఉన్న తెలంగాణ రైతాంగంలో ఆశలు రేపిందని గుర్తు చేశారు. అందరి రుణాలను మాఫీ చేస్తామని ఆ రోజు బహిరంగంగా చెప్పారు. కానీ ఈరోజు కొందరికే పరిమితం చేసేందుకు మార్గదర్శకాలు తీసుకువచ్చారని నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ రోజుల్లో 5 ఎకరాల వ్యవసాయదారుడు, 30 వేల జీతం చేసే ఉద్యోగి కూడా ట్యాక్స్ పరిధిలోకి వస్తున్నాడు. రేషన్ కార్డు, పీఎం కిసాన్ డాటా వంటివి పెట్టి కొందరినే రుణమాఫీకి పరిమితం చేస్తున్నారు. రుణమాఫీ చేశాం అన్న ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వ ప్రయత్నాలు తప్ప రైతాంగం బాగుండాలని, వ్యవసాయం బాగుండాలి అన్న సంకల్సం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. అసలు రాష్ట్రంలో రూ. 2 లక్షల రుణం పొందిన రైతులు ఎంత మంది ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పీఎం కిసాన్ డాటాను మార్గదర్శకంగా తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో చెప్పలేదు, అసలు దానికి సంబంధించిన షరతులే లోపభూయిష్టం అయినవి అన్నారు. రుణమాఫీకి పీఎం కిసాన్ డేటాను అనుసరించడం అంటే రుణమాఫీ లక్ష్యానికి గండికొట్టడం అన్నారు. రైతాంగాన్ని వంచించడమే హామీలు ఇచ్చినప్పుడు లేని ఆంక్షలు అమలు చేసేటప్పుడు ఎందుకు అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ఆంక్షలు విధించడానికి ఈ ఏడు నెలల సమయం ఎందుకు తీసుకున్నట్లు అని ప్రశ్నించారు. నాడు పరుగెత్తి రుణాలు తీసుకోండి వెంటనే రుణమాఫీ చేస్తామని రైతులను పరుగులు పెట్టించి నేడు చావు కబురు చల్లగా చెబుతున్నారని మండిపడ్డారు.


తెల్లరేషన్ కార్డు ప్రామాణికం కాదని సీఎం రేవంత్ ఇటీవలే ప్రకటించాడు.. సరిగ్గా నాలుగు రోజులు తిరగక ముందే నాలుక మడతేశాడు. గత ప్రభుత్వాలు కేవలం కుటుంబాలను గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డులను పరిశీలించేవారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పది ఎకరాలుండి పింక్ కార్డులు ఉన్న రైతులందరికీ రుణమాఫీ వర్తించదా? మరి రేషన్ కార్డులు లేని రైతుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. రుణమాఫీపై రైతుల నుండి ఫిర్యాదులను కోరడం అంటే రైతుల మధ్య వివాదాలను సృష్టించడమే అన్నారు. ఎన్నికల్లో ఆశ చూపి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ అధికారం వచ్చాక హామీల నుండి తప్పించుకునేందుకు సాకులు వెతుకుతుందని విమర్శించారు. పీఎం కిసాన్ డాటా ఉంటే మళ్లీ రుణమాఫి అమలుకు వ్యవసాయ అధికారులను బాధ్యులను చేయడం ఎందుకు? రైతుల నుండి ఫిర్యాదులు ఆహ్వానించడం ఎందుకు? తెల్ల రేషన్ కార్డు ప్రామాణికత ఎందుకు అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆసలు ప్రభుత్వానికి రుణమాఫీ విషయంలో చిత్తశుద్ధి లేకనే గందరగోళంగా రుణమాఫీ మార్గదర్శకాలు నిర్ణయించిందని తెలిపారు. అధికారులు, రైతుల మధ్య ఈ మార్గదర్శకాలు చిచ్చుపెట్టేలా ఉన్నాయి అని ఆరోపించారు. ఈ విధానం మూలంగా అధికారుల మీద రాజకీయ వత్తిళ్లు పెరుగుతాయి అని, కాంగ్రెస్ మోసాలకు భవిష్యత్‌లో కర్షకులు గుణపాఠం చెబుతారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. 

 

మార్గదర్శకాలు కావివి.. మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు

రుణమాఫీ మార్గ దర్శకాలు అభ్యంతరకరం

కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది

రుణమాఫీపై ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలపై ఆగ్రహం వ్యక్తంచేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
pic.twitter.com/cCmYqVIu0u

— News Line Telugu (@NewsLineTelugu) July 15, 2024 ">http://

 

newsline-whatsapp-channel
Tags : india-people brs congress cm-revanth-reddy singireddyniranjanreddy

Related Articles