RSP: నిరుద్యోగులను కాంగ్రెస్‌ మోసం చేసింది

Published 2024-07-05 05:09:39

postImages/2024-07-05/1720172933_rspwar1.jpg

న్యూస్ లైన్ డెస్క్:  నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ నిరుద్యోగుల మీద రేవంత్ రెడ్డి సర్కార్ నిర్భందాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. టీజీపీఎస్పీని ముట్టడించిన వేల మంది విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ ముందు బారికేడ్లు ముళ్లకంచెలు అంతర్జాతీయ సరిహద్దును తలపిస్తున్నాయిని ఆయన అన్నారు. నిరుద్యోగుల న్యాయమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మంత్రి వర్గం కేవలం పోలీసులను, బౌన్సర్లను, అబద్దాలను నమ్ముకున్నారని విమర్శలు చేశారు. కాంగ్రెస్ కాంగీయులను నమ్మి ఘోరంగా మోసపోయిన నిరుద్యోగులకు ప్రవీణ్ కుమార్ నిప్పులాంటి నిజాలను బయటపెట్టారు.

కేసీఆర్ పాలనలో 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు. అంటే ఏడాదికి దాదాపుగా సగటున 16,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. ఇక ప్రైవేటు రంగంలో భర్తీ అయిన ఉద్యోగాలు లక్షల్లో ఉంది. మరోవైపు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తమన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 7 నెలల్లో కేవలం 6063 ఉద్యోగాలకు నోటిఫై చేశారన్నారు. 2016-17 లో గురుకుల ఉపాధాయ పోస్టులకు అర్హత విషయంలో నిరుద్యోగులు ఒక్క రోజు ఆందోళన చేస్తే అర్హత మార్కులను ఒక మెమోతో కేసీఆర్ మరుసటి రోజే సవరించారు. 2023 లో గ్రూప్ -1 లీకేజి విషయంలో నిరుద్యోగులు మార్చి 15న 2023 ఆందోళన చేస్తే, కేసీఆర్ మార్చి 17న ప్రిలిమ్స్ ను రద్దు చేయించి సిట్ వేసి ఎంతో మంది నిందితులను అరెస్టు చేయించారు. 10వ తరగతి తెలుగు ప్రశ్నాపత్రం లీకైతే బాధ్యుడైన బండి సంజయ్, ఎంపీ కూడా అరెస్టు చేయడానికి కేసీఆర్ వెనకాడ లేదన్నారు. ఆనాడు టీఎస్‌పీఎస్పీ ఛైర్మన్ చేతకానితనం వల్ల రెండవసారి కూడా గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను కోర్టు రద్దు చేసింది. 2023లో గ్రూప్-2 ఎగ్జాం చాలా పరీక్షలతో క్లాష్ అవుతుందని ఒక్క సారి నిరుద్యోగులందరూ రెప్రజెంట్ చేస్తే ఆ పరీక్ష కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం కేసీఆర్ వాయిదా వేయించారు.


వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు మాకు చాలా కాలంనుండి అన్యాయం జరుగుతున్నదంటే వాళ్లందరిని ఒక్క జీవోతో రెగ్యులరైజ్ చేశారు. జూనియర్ పంచాయత్ సెక్రటరీలు 10 రోజులు నిరవధిక సమ్మె చేస్తే వాళ్లందరి డిమాండ్లను సావధానంగా విని ఒక్క కేసు లేకుండా రెగ్యులరైజ్ చేశారు. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు సమ్మె చేస్తే వాళ్ల సమస్యలను పరిష్కరించారు. ఒక్కరి మీద కూడా పోలీసులను ప్రయోగించలేదు. నిరవధిక సమ్మెలు చేసినా ఆర్టీసి కార్మికులనందరిని కేసీఆర్ చేరదీసి వాళ్లను గవర్నమెంటు డిపార్టుమెంటుగా మార్చారు. ఆషా వర్కర్లకు ఏఎన్ యం/జీయన్ఎం లకు నర్సుల పోస్టుల్లో వెయిటేజ్ ఇచ్చి వాళ్ల కుటుంబాలు రోడ్డు మీద పడకుండా కాపాడిన నాయకుడు కేసీఆర్ అన్నారు. చాలా ప్రభుత్వ శాఖల్లో సమ్మెలకు అవకాశం లేకుండా ఉద్యోగుల సంక్షేమాన్ని గుండెలో పెట్టుకొని పరిపాలించారు. తనకు తెలిసి కేసీఆర్ పాలనలో ఏ నిరుద్యోగికి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేసే అవసరం రాలేదని, ఒక వేళ వచ్చినా ఒకటి రెండు రోజుల్లో ఆ సమస్య పరిష్కారం అయ్యేదని తెలిపారు. 

ఇప్పుడేమో ఒకటే డిమాండ్ మీద అశోక్ సార్(రెండు సార్లు), మోతిలాల్, బక్క జడ్సన్ లు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలిసి తెలిసి గురుకులాల్లో బాక్లాగ్ పోస్టులు సృష్టించింది. వీటన్నిటిపై కాంగీయులు స్పందించాల్సింది పోయి గాంధీ భవన్ నుండి గూండాలను బౌన్సర్లను పంపించి అమాయక నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అసలు ఇంతవరకు ముఖ్యమంత్రి రేవంత్ నిరుద్యోగుల సమస్యలపై ఒక్కసారికూడా స్పష్టమైన ఆధారాలతో మాట్లాడలేదన్నారు. ఎమ్మెల్యే-ఎమ్మెల్సీల కొనుగోలు చేయడానికి ఢిల్లీ పర్యటనల్లో బిజీగా ఉన్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో సమ్మెలు సర్వసాధారణం, కానీ ప్రజలను ప్రేమించే నాయకులు పట్టువిడుపు ప్రదర్శిస్తారన్నారు. తెలంగాణకు కేసీఆరే సీఎంగా ఉంటే బాగుండని ఇప్పుడు అనిపిస్తుంది కదా, అందుకే ద్రోహులను పాతర పెట్టనీకె, మన తెలంగాణను ఢిల్లీ నుండి మళ్లీ కాపాడుకోనీకె పల్లె పల్లెనా, గల్లీ గల్లినా ప్రజలను చైతన్యవంతం చేయడమే మన తక్షణ కర్తవ్యం అని ప్రవీణ్ కుమార్ ప్రజలకు పిలుప్పునిచ్చారు.