గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణలో లోపం వలన డెంగ్యూ జ్వరాలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి అని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణలో లోపం వలన డెంగ్యూ జ్వరాలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి అని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ మొద్దు నిద్రకు నిదర్శనం అని విమర్శించారు. పారిశుధ్య నిర్వహణ లోపంతో ప్రజలకు జ్వరాలు శాపంగా మారాయి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా, తడకపల్లి గ్రామానికి చెందిన కనకలక్ష్మి డెంగ్యూ జ్వరంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న హరీష్ రావు బుధవారం ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. ఆయన మాట్లాడుతూ ఆమె చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సేవలు అందక, ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం భూమి అమ్ముకొని 25 లక్షల రూపాయలు ఖర్చు చేసినా, ప్రాణం కాపాడలేకపోయారని తెలిపారు.
ఇద్దరు చిన్న పిల్లల జీవితాలు ఆగం చేసి, ప్రభుత్వం రోడ్డున పడేసిందని వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన మొద్దు నిద్రను వీడి పారిశుధ్య నిర్వహణను పటిష్టంగా చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.