చనిపోయిన వ్యక్తి ప్రభాకర్ తను కాంగ్రెస్ పార్టీకి ఓటేశాను అని మరణ వాంగ్మూలం ఇస్తే అతను బీఆర్ఎస్ కార్యకర్త అనడానికి సిగ్గు లేదా అని కోదండ రెడ్డిని ప్రశ్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కోదండ రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిగిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నాయకుల ప్రోద్బలంతోనే ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ కోదండ రెడ్డి బుధవారం ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆసలు కోదండ రెడ్డికి సిగ్గుందా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తి ప్రభాకర్ తను కాంగ్రెస్ పార్టీకి ఓటేశాను అని మరణ వాంగ్మూలం ఇస్తే అతను బీఆర్ఎస్ కార్యకర్త అనడానికి సిగ్గు లేదా అని కోదండ రెడ్డిని ప్రశ్నించారు. వాళ్ళ నాన్న వెళ్ళి కంప్లైంట్ ఇస్తే A1గా ఉన్న కాంగ్రెస్ జెడ్పీటీసీ భర్త కూరపాటి కిషోర్ ని పోలీసులు A8 గా మార్చారని ఆరోపించారు. ఎందుకు మార్చారు అనేది పోలీసులు చెప్పాలని లేదా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి భట్టి విక్రమార్క అయినా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభాకర్ చావుకు కారణమైనటువంటి వ్యక్తిని కోదండ ఎందుకు A8 మార్చారు, వెనకాల ఏ శక్తులు ఉన్నాయిని నిలదీశారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ రైతు రాజ్యం వస్తుందని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశానని స్వయంగా వీడియో సాక్షిగా చెప్పారు. కానీ కాంగ్రెస్‌కు ఓటు వేసి ప్రభాకర్ మోసపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రభాకర్ ఆత్మహత్యకు బాధ్యత వహించాలని తాత మధు డిమాండ్ చేశారు.