అర్హత ఉన్న ఎందరో ఉద్యమకారులు, పార్టీ నాయకులను పక్కన పెట్టి నమ్మకంతో పార్టీ కోసం పని చేస్తారని అవకాశం ఇస్తే.. స్వార్ధం కోసం అధికార పార్టీలో చేరారని మండిపడ్డారు. ఉద్యమకారులను చేరదీయలేదని, కార్యకర్తలను పట్టించుకోలేదని, ఆఖరికి చేవెళ్ల గడ్డపైన పార్టీని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: ఇటీవల BRS పార్టీని వీడి కాంగ్రెస్(congress)లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య(Kale Yadaiah)పై అటు క్యాడర్(cadre)తో పాటు, ఇటు ప్రజల నుండి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. యాదయ్యను నమ్మి మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్(KCR) రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. BRS అండతో రాజకీయంగా నిలదొక్కుకున్న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంపై తన సొంత నియోజకవర్గంలోని ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే చేవెళ్లలో BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్(Chatari Dasharath) ఆధ్వర్యంలో ఎమ్మెల్యే యాదయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దశరథ్.. యాదయ్యపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన ఒక వలస పక్షి వంటి వారని అన్నారు. అధికారం అనే సీజన్ ఎక్కడుంటే అక్కడ వాలిపోయే పక్షి ఎమ్మెల్యే కాలే యాదయ్య అని ఎద్దేవా చేశారు. ఉద్యమాలు చేసి, పోరాటాలు చేసి, గద్దెలు కట్టి నిర్మాణం చేసిన BRS పార్టీలోకి అధికారం రాగానే వచ్చి, పదేళ్లు అధికారం అనుభవించారని మండిపడ్డారు. తన భార్యను ZPTC, కొడుకునుZPTC, మరో కొడుకును MPP చేసేందుకు పార్టీ యాదయ్య వాడుకున్నారని దశరథ్ ఆరోపించారు.
అర్హత ఉన్న ఎందరో ఉద్యమకారులు, పార్టీ నాయకులను పక్కన పెట్టి నమ్మకంతో పార్టీ కోసం పని చేస్తారని అవకాశం ఇస్తే.. స్వార్ధం కోసం అధికార పార్టీలో చేరారని మండిపడ్డారు. ఉద్యమకారులను చేరదీయలేదని, కార్యకర్తలను పట్టించుకోలేదని, ఆఖరికి చేవెళ్ల గడ్డపైన పార్టీని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం పని చేసిన వారందరికీ యాదయ్య క్షమాపణ చెప్పాలని దశరథ్ డిమాండ్ చేశారు. యాదయ్య తీరు వల్ల ఎందరో ఉద్యమకారులు పార్టీకి దూరమయ్యారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న తీరును BRSV తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బెదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తూ ఇబ్బందులను ఒత్తిడికి గురి చేస్తూ లొంగదీసుకుంటుందని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం,ప్రజా పాలన అంటూ ప్రజా స్వామ్య వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కాంగ్రెస్ రాజకీయాలు మాత్రమే చేస్తుందని దశరథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.