Cm Revanth: డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

తెలంగాణ దర్పం, పోరాట స్ఫూర్తి ఉట్టిపడేలా, ఆత్మవిశ్వాసం తొణికిసలాడే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.


Published Aug 28, 2024 05:45:47 AM
postImages/2024-08-28/1724839212_laid.PNG

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ దర్పం, పోరాట స్ఫూర్తి ఉట్టిపడేలా, ఆత్మవిశ్వాసం తొణికిసలాడే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దొరతనానికి ప్రతీకగా కాకుండా ప్రజలు తమ కన్నతల్లిని చూసుకున్నంత సంతోషకరంగా తెలంగాణ తల్లి రూపం ఉంటుందని స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ప్రధాన ద్వారం ముందు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు సీఎం భూమిపూజ చేశారు.

మిలియన్ మార్చ్ తరహాలో లక్షలాది మంది సమక్షంలో డిసెంబర్ 9న వైభవోపేతంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేపడతామని ప్రకటించారు. సంకల్పం, పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని తెలంగాణ ఉద్యమం నిరూపించిందని ముఖ్యమంత్రి అన్నారు. సచివాలయ ఆవరణలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని దశాబ్ది వేడుకల సందర్భంలోనే తాను ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. విగ్రహ నమూనా రూపొందించే బాధ్యతను జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగానికి అప్పగించామన్నారు. 

సచివాలయం లోపల తెలంగాణ తల్లి, మరోవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, దానికి ఎదురుగా పీవీ నర్సింహారావు, అంజయ్య విగ్రహాలు, జైపాల్ రెడ్డి స్మారకం, ఇటువైపు కాకా వెంకటస్వామి తదితర మహానుభావుల విగ్రహాలు, అమరవీరుల స్మారకచిహ్నం అన్నారు. బుధవారం తప్పితే దసరా వరకు మంచి రోజులు లేవని వేద పండితులు చెప్పడంతో హుటాహుటిన భూమిపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేరళ వెళ్లడం, మిగతా మంత్రులు ముందే నిర్దేశించిన కార్యక్రమాల్లో ఉండటం వల్ల హాజరుకాలేక పోయారని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

newsline-whatsapp-channel
Tags : india-people congress cm-revanth-reddy telanganathallistatue

Related Articles