Cm Revanth: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్ వ్యాధుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.


Published Aug 27, 2024 07:26:05 PM
postImages/2024-08-27/1724766965_rhealth.PNG

న్యూస్ లైన్ డెస్క్: సీజనల్ వ్యాధుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. డెంగ్యూ, చికున్ గున్యా, వైరల్ జ్వరాలతో వివిధ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై సీఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులు ప్రబలకుండా తగిన నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రేయింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో క్రమం తప్పకుండా ఫాగింగ్ జరిగేలా చూడాలని, ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని సీఎం ఆదేశించారు.

సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చేపట్టే చర్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే ఉద్యోగులు, సిబ్బందిపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. జీహెచ్ఎంసీ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. 

అవసరమైతే పోలీసు విభాగం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారం తీసుకొని సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులపై వెంటనే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, గ్రామాలు, పట్టణాలకు వెళ్లి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. డెంగ్యూ, చికున్ గున్యా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి కారణాలను గుర్తించాలని, అవసరమైన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు. 

newsline-whatsapp-channel
Tags : india-people government-hospital cm-revanth-reddy meet ias-officer seasonalfevers

Related Articles