మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల ఆర్ధిక సహాయం అందిస్తామని రేవంత్ అన్నారు. కుటుంబాలను పరామర్శించి వారి కష్టనష్టాలను తెలుసుకున్నామని వెల్లడించారు. మరిపెడ మండలంలో మూడు తండాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలోని జిల్లాల్లో కూడా హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వర్షాలపై ఏర్పాటు చేసిన రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను వెల్లడించారు.
చెరువులు, వాటికి సంబంధించిన స్థలాల్లో నిర్మాణాలు జరిపిన వారు ఎవరైనా సరే.. వెనక్కి తగ్గకుండా పని చేయాలని ఆయన సూచించారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అక్రమ కట్టడాల కారణంగానే ఖమ్మంలో వరదలు వచ్చాయని ఆయన అన్నారు. గత 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 42 సెం.మీ వర్షం పడిందని అన్నారు.
ప్రకృతి మీద మనుషులు దాడి చేస్తే.. తిరిగి ప్రకృతి దాడి చేస్తుందనడానికి ఇటీవల జరిగిన విపత్తు నిదర్శనమని రేవంత్ అన్నారు. ఇది ఒక గుణపాఠమని ఉత్తరాఖండ్, ఏపీ, తెలంగాణ ఏ ప్రాంతమైనా.. దీన్ని గుణపాఠంగా చేసుకోవాలని రేవంత్ అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల ఆర్ధిక సహాయం అందిస్తామని రేవంత్ అన్నారు. కుటుంబాలను పరామర్శించి వారి కష్టనష్టాలను తెలుసుకున్నామని వెల్లడించారు. మరిపెడ మండలంలో మూడు తండాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు.
కేంద్రం వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించాలని రేవంత్ డిమాండ్ చేశారు. విష జ్వరాలు ప్రబలి అంటురోగాలు పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. మెడికల్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బురద కడగడానికి వీలైనన్ని నీళ్ల ట్యాంకర్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగమంతా సమన్వయం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ఇతర జిల్లాల పోలీసులు, అధికారుల సాయం తీసుకోవాలని సూచించారు.