మంత్రాల బలం లేకున్నా తుంపిర్ల బలం ఉండాలంటారు. అలాగే.. పని చేసే ఉద్దేశం లేనప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి సవాలక్ష కారణాలను చూపిస్తుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్న వ్యవహారం కూడా అలాగే
మంత్రి కొండా సురేఖ దిగజారుడు ఆరోపణలు..!
మంత్రిపదవిలో ఉంటూ నీచమైన మాటలు
అసభ్యంగా లేకున్నా ఎక్స్ పోస్ట్ విషయంలో రాద్ధాంతం..!
అసలు సమస్యను పక్కదారి పట్టించేందుకేనా.?
సునీలు కనుగోలు డైరెక్షన్ లో వ్యవహారం
వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా కనుగోలు ప్రణాళికలు
గత ప్రభుత్వ పెద్ద కుటుంబంపై నీచాతినీచంగా పోస్టులు
ఎన్నికల హామీలు ఎగ్గొట్టారని ప్రజల్లో తీవ్ర ఆగ్రహం
హైడ్రా, మూసీ విషయంలో సర్కారుపై వ్యతిరేకత
ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న ప్రజలు
ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ సర్కారుకు చీవాట్లు
దీన్నుంచి దృష్టి మరల్చేందుకే రాద్ధాంతం..!
గతంలో మాదిరిగానే వ్యక్తిత్వహననానికి ప్లాన్
సొంత పార్టీ చిల్లర పోస్టులపై మాట్లాడని మంత్రులు
పేదల సమస్యను పూర్తిగా పక్కదారి పట్టించిన సర్కారు..!
సొంత మీడియా సహకారంతో సక్సెస్ ఫుల్ గా ప్లాన్ అమలు..!
న్యూస్ లైన్ డెస్క్: మంత్రాల బలం లేకున్నా తుంపిర్ల బలం ఉండాలంటారు. అలాగే.. పని చేసే ఉద్దేశం లేనప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి సవాలక్ష కారణాలను చూపిస్తుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్న వ్యవహారం కూడా అలాగే ఉంది. ఒక అనవసరమైన అంశాన్ని పెద్దదిగా చేసి చూపించి.. అసలు అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్ లో సునీల్ కనుగోలు సారథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఓ నీచ రాజకీయ క్రీడ మొదలైంది. తెలంగాణ ఎన్నడు చూడని నీచాతి నీచాలను చూడాల్సి వస్తోంది.
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలనే కాదు.. సినీ పరిశ్రమలోనూ తీవ్ర దుమారం రేపాయి. తాను మంత్రి పదవిలో ఉన్నాననే విషయం మరిచిపోయిన.. మాజీ మంత్రి కేటీఆర్ పై ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయితే.. కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్ట్ ను పట్టుకుని ఇంత రాద్ధాంతం చేయడంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఆ పోస్ట్ లో ఎలాంటి కించపరిచే పదాలు లేకున్నా.. దాన్ని ఓ జాతీయ సమస్యలాగా కాంగ్రెస్ పార్టీ చిత్రీకరిస్తోంది. పెద్దగా ఎవరూ చూడని పోస్ట్ ను తీసుకొచ్చి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రపంచమంతా చూపిస్తున్నారు. చూసినవాళ్లంతా కూడా అందులో తప్పేం లేదుకదా అనే అంటున్నారు. అయినాగానీ ఎందుకు ఇంతలా రాద్ధాంతం చేస్తున్నారు.? రెండు మూడు సార్లు మంత్రి కొండా సురేఖ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారనేది ఆసక్తికరంగా మారింది. ఏకంగా ఇవాళ కేటీఆర్ పై చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో తీవ్రత మరింత పెరిగింది.
గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏ అంశాల విషయంలో అయితే గత ప్రభుత్వంలో ఉన్నవారి వ్యక్తిత్వాన్ని హననం చేశారో.. అవే అంశాలను ఎంచుకున్నట్టుగా కనిపిస్తోంది. అవే అంశాలపై కొండా సురేఖ విమర్శలు చేయడం.. దానిపై వెంట వెంటనే కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం అంతా కూడా ప్రణాళికలో భాగంగానే కనిపిస్తోంది. గతంలో ఇవే అంశాలపై ఆ పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్, కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల హ్యాండిల్స్, సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తుల హ్యాండిల్స్ లో నీచాతి నీచంగా పోస్టులు పెట్టారు. ఎమ్మెల్సీ కవిత విషయంలో ఫొటోలు మార్ఫింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. లిక్కర్ బాటిల్స్ చుట్టూ కవిత బతుకమ్మ ఆడినట్టు.. వీడియోలు సైతం క్రియేట్ చేసి సోషల్ మీడియాలో తిప్పారు. వీటిపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న సమయంలో కూడా ఏనాడూ కాంగ్రెస్ మహిళా నాయకులు స్పందించలేదు. కానీ ఇప్పుడు మహిళనైన తనను అవమానించారని అంటూ కొండా సురేఖ ఆరోపించారు. కానీ.. ఇతర మహిళలను అవమానించేలా, వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మంత్రి కొండా సురేఖ కామెంట్స్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే.. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల స్ట్రాటజిస్టుగా పనిచేసిన సునీల్ కనుగోలు కథ,స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అని తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్న అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించాలంటే ఓ కొత్త అంశాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే... ఇదంతా చేసినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతోంది. ఎన్నికల హామీల అమలులో వైఫల్యంతో ఇప్పటికే ప్రజలు తీవ్రఆగ్రహంతో ఉన్నారు. రైతులందరికి రుణమాఫీ అని.. కొందరికే మాఫీ చేసి మిగతావారందరికి హ్యాండిచ్చారు. అలాగే వానాకాలం పంట ముగిసిపోయినా ఇప్పటి వరకు రైతుబంధు డబ్బులు రాలేదు. కాంగ్రెస్ ఇస్తానన్న రైతుభరోసాకు అతీగతీ లేదు. దీంతో రైతులంతా ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. ఇదే సమయంలో రేవంత్ సర్కారు తీసుకొచ్చిన హైడ్రా.. దీన్ని మరింత పెంచింది. పేదోళ్ల ఇండ్లు కూల్చేయడం, వారికి నిలువ నీడ లేకుండా చేయడంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీనితోడు మూసీ సుందరీకరణ పేరుతో నదీ పరివాహక ప్రాంతంలో ఇండ్లు కూల్చివేసే పనులు మొదలుపెట్టడంతో ఆ వ్యతిరేకత మరింత ఎక్కువైంది. పేద, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలంతా రోడ్డెక్కారు. ఇలా ఒక అంశం తర్వాత మరో అంశంలో సర్కారుపై వ్యతిరేకత పెరుగుతూ పోతోందనేది ఓపెన్ సీక్రెట్.ఏడాది తిరగక ముందే ప్రభుత్వంపై ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తే ఎలా అనే ఆందోళనలో కాంగ్రెస్ పడిపోయినట్టుగా తెలుస్తోంది.
దాన్నుంచి బయటపడాలంటే ఓ బలమైన అంశాన్ని తీసుకొచ్చి ప్రచారం కల్పించాలనే ఆలోచనలో భాగంగా మొదలైనదే ఈ నీచరాజకీయం అనే మాట వినిపిస్తోంది. అందుకే పది రోజుల క్రితం ఎక్స్ లో చేసిన పోస్ట్ పై రెండు రోజుల క్రితం కొండా సురేఖ మాట్లాడారంటున్నారు. కానీ ఆ ప్రెస్ మీట్ అనుకున్న స్థాయిలో సంచలనంగా మారలేదు. దీంతో మరో ప్లాన్ వేసి.. ఇవాళ మరింత ఘాటుగా విమర్శలు చేయించారంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, కేసీఆర్ కుమారుడు కూడా కావడంతో.. రాష్ట్రమంతా ఈ అంశంపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. హైడ్రా కూల్చివేతలు, హైడ్రా విషయంలో హైకోర్టు పెట్టిన చీవాట్లు, మూసీ కూల్చివేతలన్నీ కూడా పక్కకు వెళ్లిపోతాయనే ఆలోచనతోనే ఇదంతా చేశారని తెలుస్తోంది. అందులో భాగంగానే.. కొండా సురేఖ మాట్లాడిన వెంటనే.. కొన్ని సెలెక్టెడ్ వీడియో క్లిప్పింగులతో అధికార పార్టీ అనుకూల మీడియాలో నాన్ స్టాప్ గా లైవ్ లు నడిపించారనే చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీ వివరణ కూడా తీసుకోకుండా.. కేవలం మంత్రి సురేఖ, సీతక్క, ఇతర మహిళా నాయకుల ఇంటర్వ్యూలతో సినిమా నడిపించినట్టు కనిపిస్తోంది. తద్వారా ఈ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, ఎక్కువగా పబ్లిసిటీ చేసే ఉద్దేశమే కనిపిస్తోంది.