రాహుల్ గాంధీ కృతజ్ఞత సభ మాత్రం రద్దయింది.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో గొప్పలు చెప్పుకొని ఆగస్టు 15న రాహుల్ గాంధీని తీసుకొని వచ్చి వరంగల్‌లో కృతజ్ఞత సభ పెడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించి రాహుల్ గాంధీని కూడా కలిశారు. అయితే రాహుల్ గాంధీ కృతజ్ఞత సభ మాత్రం రద్దయింది. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో ప్రజల్లో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ స్పందన రాకపోవడంతో సభ రద్దయినట్లు టాక్. రుణమాఫీ వెనకున్న అసలు కారణాలు ఏంటి అంటే 40 లక్షల మంది రైతులకు రూ. 32 వేల కోట్లతో రుణ మాఫీ చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించగా రెండు విడతల్లో కలిపి 17.75 లక్షల మందికి రూ. 12.22 వేల కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించింది.
ఆగస్టు 15న చివరి మూడో విడతలో మరో రూ. 6 వేల కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే రుణమాఫీకి చెప్పింది రూ. 32 వేల కోట్లు అయితే ఇచ్చింది. ఇవ్వబోయేది కలిపితే రూ. 18 వేల కోట్లు మాత్రమే కావడం.. చెప్పిన దాంట్లో సగం మంది రైతులకే రుణమాఫీ కావడంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మరోవైపు జూన్ నెలలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం రైతుబంధు ఆపి రుణ మాఫీ పేరిట కాలయాపన చేస్తుందని రైతులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సభ రద్దు చేసినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.