రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వలన జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వలన జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. వర్షాలు, వరదల వలన జరిగిన నష్టం అంచనా వేయడంపై మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఇప్పటికీ అనేక జిల్లాల్లో వరదలు, వానలు తగ్గుముఖం పట్టలేదని అన్నారు. జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయడానికి సంబంధిత శాఖల బృందాలను క్షేత్ర స్థాయికి పంపి, తగు జీపీఎస్ కోఆర్డినెట్ లతో సహా సమర్పించాలని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతీ జిల్లాలో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ లను ఏర్పాటు చేయడానికి కావాల్సిన నిధులు, సిబ్బంది, పరికరాల వివరాలు వెంటనే సమర్పించాలని అన్నారు.
ఈ వర్షాలు, వరదల వల్ల ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా వెంటనే తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డీజీపీ జితేందర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణ రావు, రవీ గుప్తా, వికాస్ రాజ్, అర్వింద్ కుమార్, ముఖ్య కార్యదర్శులు దాన కిషోర్, నవీన్ మిట్టల్, కార్యదర్శులు రాహుల్ బొజ్జా, రఘునందన్ రావు, లోకేష్ కుమార్, రోనాల్డ్ రోస్, ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో జీహెచ్ ఎంసీ కమీషనర్ ఆమ్రపాలి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారాఫ్ అలీ, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ హనుమంత రావు, పాఠశాల విద్య శాఖ డైరెక్టర్ నర్సింహా రెడ్డిలు కూడా పాల్గొన్నారు.