న్యూస్ లైన్ డెస్క్ : గత ప్రభుత్వం హయాంలో లాభాల బాటలో పయనించిన తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డైరీ) గత ఆరు నెలలుగా తీవ్ర నష్టాలను రుచిచూస్తోంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన విజయ డైరీ నిధుల కొరత, ఉత్పత్తుల అమ్మకాలు తగ్గడంతో విజయ డైరీ నష్టాల బాటలో నడుస్తోంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఐదేళ్ల పాటు డివిడెండ్ అందించారు. కాగా..గత ఆరునెలల నుంచి ఆ డివిడెండ్ నిలిపివేశారు. ప్రతిరోజు లక్షా 50వేల మంది పాడి రైతుల నుంచి సుమారు 3లక్షల పాలను విజయ డైరీ సేకరిస్తోంది. ఇందుకు గానూ.. రోజుకు కనీసం రైతులకు రూ.1.5 ట్ల నుంచి రూ. 2కోట్ల వరకు బిల్లులు చెల్లించాలి.
గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి పాడి రైతులకు బిల్లులు చెల్లించే విధానం ఉండేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిధులు తగ్గించడంతో పాడి రైతులకు బిల్లుల చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. పాడిని ప్రోత్సహించేందుకు 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన రూ.4 రాయితీని కూడా రేవంత్ సర్కార్ చెల్లించడం లేదు. దీంతో బిల్లులు రాక, ప్రోత్సాహకాలు అందక పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో విజయడైరీ నష్టాల్లోకి నెట్టివేయబడింది. అతి తక్కువ కాలంలోనే ప్రజల్లో మంచి డిమాండ్ సంపాదించిన విజయ డైరీ నెయ్యి, పాలపొడి, వెన్న, మజ్జిగ, దూద్ పేడ, లస్సీ, పెరుగు, ఐస్ క్రీమ్ తదితర ఉత్పత్తుల విక్రయాలు సైతం మందగించాయి. రంగారెడ్డి జిల్లాలోని రావిరాలలో బీఆర్ఎస్ రూ.246 కోట్లతో మెగా డెయిరీ నిర్మించారు. 9 టన్నుల నెయ్యితో పాటు ఇతర ఉత్పత్తుల తయారీకి భారీ సామర్థ్యంతో అందించేలా చర్యలు తీసుకున్నారు. ఈ డైరీ నిర్మాణం కోసం మరో రూ.100 కోట్ల గ్రాంటు ఇవ్వాల్సి ఉంది. ఇదే విషయాన్ని విజయ డైరీ ప్రస్తుత ప్రభుత్వానికి వివరిస్తూ పలుసార్లు విన్నవించిన గ్రాంట్లు విడుదల చేయడం లేదు. గత పదేళ్లుగా దిగ్విజయంగా నడిచిన విజయ డైరీ.. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో నష్టాల బాటలో కుంటి నడకలు నడుస్తోంది.