న్యూస్ లైన్ డెస్క్ : హైడ్రాపై కాంగ్రెస్‌లో ఓ పెద్ద హైడ్రామా నడుస్తోందట. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై సొంత పార్టీ నేతలే అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. రేవంత్ ఒంటెద్దు పోకడ, సొంత నిర్ణయాలు తీసుకోవడంతో ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు వస్తోందని చెప్పారట. ఆయన సొంత ఎజెండాను ప్రభుత్వంపై రుద్ది ప్రజలను, పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధిష్టానానికి చాలా మంది కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో కొంత మంది బడా నేతల ఇళ్లు కూల్చి, ఆ తర్వాత మొత్తం పేదల ఇళ్లను నేల మట్టం చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారట. దశాబ్దాలుగా ఉంటున్న పేదల ఇళ్లను అకస్మాత్తుగా కూలగొట్టి, వాళ్లందరినీ రోడ్డున పడేస్తున్నారని వివరించారట. పేదలకు ఇళ్లు నిర్మించాల్సిందిపోయి ఇలా కూల్చడం ఏంటని, పైగా ప్రస్తుతం కూల్చుతున్న ఇండ్లు అన్నీ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరు చేసినవని చెప్పారట. అప్పడు మనమే ఇచ్చి.. ఇప్పుడు మనమే కూల్చడంతో ప్రజలు తిరగబడుతున్నారని పూసగుచ్చినట్లుగా ఇక్కడి పరిస్థితులను వివరించారట. అంతేకాదు... హైడ్రా వెనుక అసలు కారణం వేరే ఉందన్న అనుమానాలు సైతం వ్యక్తం చేశారట. హైడ్రా అడ్డుపెట్టుకొని బ్యాగులు నింపడం పనిగా పెట్టుకున్నారని పార్టీ పెద్దలకు చెప్పారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీంతో పాటు తనకు రాజకీయంగా టార్గెట్ గా ఉన్నవారిపై కక్ష తీసుకునేందుకు వాడుకుంటున్నారని వివరించారట. ఇంతవరకు సరేగానీ.. రేవంత్ చర్యల్లో కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే కుట్రలు కూడా ఉన్నాయని హస్తం పెద్దలకు కొందరు నేతలు చెప్పినట్టుగా తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ గతంలో పేదలకు స్థలాలు కేటాయించి. ఇళ్లు నిర్మించిందో ఆ ప్రాంతాల్లోనే ఇప్పుడు కూల్చివేతలు నడుస్తున్నాయని చెప్పారట. ఇటీవల మహబూబ్ నగర్ లో వికలాంగుల ఇళ్లు కూల్చివేత ఘటనను సైతం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని తెలిసి కూడా ఇలా చేయడం అంటే.. పార్టీని బద్నాం చేసే కుట్ర కాకుంటే మరేంటని ప్రశ్నించారట. దీంతో అధిష్టానం సైతం హైడ్రాపై ఫుల్ ఫోకస్ పెట్టిన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతల వరుస ఫిర్యాదులతో రేవంత్ వ్యవహారంపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సైతం ఆగ్రహంగా ఉన్నట్టుగా పార్టీలోనే చర్చ జరుగుతోంది. పేదల ఇళ్లను కూల్చడం ఏంటని మండిపడుతున్నారట. కనీసం వాళ్లకు గడువు ఇవ్వకుండా ఇళ్లు కూలగొట్టి వెళ్లిపోవడం, జనాలు రోడ్డునపడ్డా పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పేదలను కాపాడాల్సింది పోయి ఓ నియంతలా వ్యహరించడం ఏంటని అగ్రనేతలే ఆశ్చర్యపోయారట. ఇక్కడ చేసే పొరపాట్లు రేపు రానున్న 4 రాష్ట్రాల ఎన్నికలపై పడే ప్రమాదం ఉందని ఆందోళన పడుతున్నారట. దీంతో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలో పడిందట హైకమాండ్. రాష్ట్ర పార్టీ సీనియర్లతో రిపోర్టులు తెచ్చుకునే పనిలో పడిందని అంటున్నారు. వీలైనంత త్వరలో ఈ ఇష్యూను సెట్ చేయాలని లేకపోతే పార్టీకి ఇబ్బందులు తప్పవనే ఆలోచనలో అధిష్టానం ఉందని రాష్ట్ర కాంగ్రెస్ లోని రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం అంటోంది.