జనవరి నుండి ఇప్పటి వరకు ఎన్నో చర్చలు జరిపామని అన్నారు. రాజకీయ నాయకులు విదేశాలకు వెళ్తే పెట్టుబడులు రావని ఆయన అన్నారు. తనను తీసుకొని వెళ్తే పెట్టుబడులు వచ్చేవని ఆయన అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: విదేశాల పర్యటనలకు వెళ్లి అక్కడి కంపెనీల నుంచి రూ.వేల కోట్ల పెట్టుబడులు తీసుకొనివచ్చామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి పెట్టుబడులను తేలేకపోయారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అంటున్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పది రోజులు విదేశీ పర్యటనకు వెళ్లి రేవంత్ రెడ్డి ఖాళీ చేతులకు ఇండియాకు వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు.
అమెజాన్, మైక్రోసాఫ్ట్‌తో పాటు వందల ఐటీ కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఏ ఒక్క కంపెనీ అయినా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. పెట్టుబడుల కోసం కంపెనీలను ఆకర్షించడానికి రావాల్సిందిగా ఇప్పటికే పలువురు నేతలు తనను కోరారని ఆయన అన్నారు.
రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో తన సహాయం కోరారని కేఏ పాల్ అన్నారు. పెట్టుబడుల కోసం అమెరికా, పారిస్, లండన్, న్యూయార్క్ వంటి ఎన్నో దేశాలకు వెళ్దామని రేవంత్ ఎన్నో సార్లు చెప్పారని, మీటింగులు కూడా పెట్టారని తెలిపారు. జనవరి నుండి ఇప్పటి వరకు ఎన్నో చర్చలు జరిపామని అన్నారు. రాజకీయ నాయకులు విదేశాలకు వెళ్తే పెట్టుబడులు రావని ఆయన అన్నారు. తనను తీసుకొని వెళ్తే పెట్టుబడులు వచ్చేవని ఆయన అన్నారు. అక్టోబర్ 1,2,3 తేదీల్లో తనతో పాటు అమెరికాకు వస్తే నేను పెట్టుబడులు తెప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు.