న్యూస్ లైన్ డెస్క్ : ఈ మధ్యకాలంలో ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్ ని తన పేరు ప్రస్తావించడంపై ఆమె అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. జయా బచ్చన్ ని చైర్మన్ ధన్ కడ్.. జయా అమితాబ్ బచ్చన్ అంటూ పిలవడాన్ని ఆమె తప్పుబట్టారు. తనను కేవలం జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుందని ఆమె అన్నారు. అయితే.. జయాబచ్చన్ విషయంపై కంగనా రనౌత్ స్పందించారు. ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా స్వీయ దర్శకత్వంలో కంగనా తెరకెక్కించిన ఎమర్జెన్సీ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న ఆమె జయాబచ్చన్ మీద వివాదాస్పద కామెంట్లు చేశారు.
జయాబచ్చన్ అహంకారంతో ప్రవర్తించారని.. స్త్రీ-పురుషుడి మధ్య ఉన్న సహజ వైరుధ్యాన్ని ఆమె వివక్షగా చూస్తున్నారని కామెంట్ చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఫెమినిస్ట్ ఉద్యమం తప్పుదోవలో వెళ్తుందని కంగనా అభిప్రాయపడ్డారు. పురుషుడు, స్త్రీ ఒక్కటవడం ఒక అద్భుతమని.. కావాలనే కొంతమంది ఫెమినిజం ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని జయా బచ్చన్ ని ఉద్దేశించి కంగనా మాట్లాడారు. అంత వయసు వచ్చి.. అంత పెద్ద స్థాయిలో ఉండి గుర్తింపు కోసం పాకులాడటం ఆమె అహంకారాన్ని సూచిస్తున్నదని కంగనా ఆరోపించారు. జయాబచ్చన్ అహంకారం వల్ల వారి కుటుంబంలోని అందమైన బంధాలకు బీటలు వారే ప్రమాదముందని కంగనా అన్నారు.