తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటారని అన్నారు. అదే సందర్భంలో త్యాగానికి గుర్తుగా హిందూ ముస్లింలు ఐక్యంగా పీర్లపండుగగా నేడు జరుపుకుంటున్న మొహర్రం.. తెలంగాణ గంగా జమున సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ సందర్భంగా ప్రార్థించారు. రాష్ట్ర ప్రభుత్వం మతసామరస్యాన్ని కాపాడేందుకు మరింతగా కృషి చేయాలని కేసీఆర్ సూచించారు.
ఆషాఢమాసంలో శుక్లపక్ష ఏకాదశి తిథినాడు నారాయణుడు క్షీరసాగరంలో శేషతల్పం మీద నాలుగునెలలపాటు కొనసాగే యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. కనుక ఆ ఏకాదశిని శయనైకాదశి లేదా తొలి ఏకాదశి అంటారు. తొలి ఏకాదశినాడు విష్ణుమూర్తిని పూజించి స్వప్నమహోత్సవం జరిపితే మహాపాపాలు సైతం చిటికెలో తొలగిపోతాయి. యజ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుంది. నెలలో రెండు ఏకాదశుల్లోనూ ఉపవాసం చేయడం వల్లశారీరక, మానసిక అనారోగ్యాలన్నీ తొలగిపోతాయని చెబుతారు. దేహం శక్తిమయం, ఉత్సాహభరితం అవుతుంది. దక్షిణాయనం ఆరంభంలో మానవులందరూ లింగభేదం, వర్ణభేదం లేకుండా చేసే లాజహోమమే తెలుగులో పేలాల పండుగ. అయితే ఈ రోజు స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలుగుతాయన్నది ప్రజల నమ్మకం.