పరీక్షలు వాయిదా వేయమని నిరుద్యోగులు అడుగుతుంటే.. వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు లాభమని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యను చూడకుండా.. కోచింగ్ సెంటర్ల లాభం గురించే రేవంత్ ఆలోచిస్తున్నాడా అని కేటీఆర్ అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్ : కోచింగ్ సెంటర్లపై సీఎం రేవంత్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్ వేశారు. పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు వందల కోట్లు లాభాలు వస్తాయన్న రేవంత్ రెడ్డికి ఆ వందల కోట్ల లాభాల్లో ఎంత ముట్టిందని ప్రశ్నించారు. ఒక్కో కోచింగ్ సెంటర్ కి రెండు మూడు నెలల్లో వందల కోట్లు లాభాలు వస్తే.. వాటిలోంచి కమిషన్ కోసమే రేవంత్ రెడ్డి పరీక్షలు వాయిదా వేశారా అని కేటీఆర్ ప్రశ్నించారు. నిరుద్యోగులు చదువుకోవడానికి సమయం కావాలని అడుగుతుంటే.. ఆ విషయం వదిలేసి పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు లాభం అంటూ మాట్లాడటం నీచమని కేటీఆర్ అన్నారు.
నిత్యం కమిషన్లు, లాభాలు, సూట్ కేసుల గురించి ఆలోచించే రేవంత్ రెడ్డి నుంచి ఇంత కంటే ఎక్కువ ఆశించడం మన తప్పే అని కేటీఆర్ సెటైర్ వేశారు. ప్రజలు నమ్మి అధికారం కట్టబెడితే.. ప్రజల పట్ల, నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న తీరు గర్హనీయమన్నారాయన. లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులపై లాఠీఛార్జీ చేయడం, అరెస్టులు చేయడం అప్రజాస్వామికం అని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ కి ప్రజలు సరైన బుద్ధి చెప్తారని కేటీఆర్ అన్నారు.