KTR: పీవీ చరిత్రను దేశం మర్చిపోదు 2024-06-28 11:58:02

న్యూస్ లైన్ డెస్క్: కవిగా, కథకుడిగా, మేధావిగా, సంస్కరణశీలిగా  భారతరత్న, మాజీ ప్రధానమంత్రి పీవీ.నరసింహారావు(P.V.Narasimha Rao) చరిత్రను దేశం ఎన్నడు మర్చిపోదని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్(KTR) అన్నారు. శుక్రవారం నరసింహారావు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మట్లాడారు. అసామాన్యమైన తెలివితేటలతో తన బహుభాషా ప్రజ్ఞ పాఠవంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన గొప్ప మేధావి పీవీ అని కేటీఆర్ కొనియాడారు. భారతదేశం ఉన్నన్ని రోజులు ఆయన పేరును దేశ ప్రజలు గుర్తుంచుకుంటారని తెలిపారు. 

తొలిసారి దక్షిణాది నుంచి దేశానికి ప్రధానిగా నాయకత్వం వహించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆర్థికంగా అతలాకుతులమై ప్రమాదం అంచున ఉన్న దేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి కాపాడగలిగిన వ్యక్తి పీవీ అని కేటీఆర్ అన్నారు. పీవీ నరసింహారావుకి ముందు, ఆయన పాలన తర్వాత అన్నతీరుగా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చారని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేని ఒక ఆర్థిక వేత్తను తీసుకువచ్చి.. ఆర్థిక మంత్రిగా నియమించుకొని అద్భుతంగా ఆర్థిక సంస్కరణలను చేపట్టారని గుర్తుచేశారు. 16 భాషల్లో అద్భుతమైన భాషా ప్రావీణ్యం ఉన్నా కొన్నిసార్లు, తన మౌనమే తన భాషగా గొప్ప పాలన నిర్వహించారని అన్నారు. తన సొంత 800 ఎకరాల కుటుంబ భూమిని ప్రభుత్వానికి అప్పగించి దేశంలో కీలకమైన భూసంస్కరణలను ప్రారంభించారని తెలిపారు. 

దేశంలో నవోదయ పాఠశాలలు, గురుకులాలు పెట్టి విద్యారంగానికి ఎనలేని సేవలందించారని అన్నారు. పివీ గురించి ఎంత చెప్పినా తక్కువనే అని.. ఆయన నిత్య విద్యార్థి, 80 ఏళ్ల వయసులో కంప్యూటర్ విద్య నేర్చుకున్న వ్యక్తి మనందరి జీవితాలకు ఆదర్శమని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, BRS ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పీవీకి భారతరత్న అవార్డు ప్రకటించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఒక మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు గొప్పగా నడిపిన వ్యక్తి పీవీ అని అన్నారు. కేవలం దేశంలోని కాకుండా దేశ, విదేశాల్లోనూ ప్రవాస భారతీయులందరిని కలుపుకొని ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. పీవీ నరసింహారావు పేరుని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న నెక్లెస్ రోడ్డుకి నామకరణం చేశామని తెలిపారు. ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. పీవీ నరసింహారావు జీవితాన్ని కేంద్రం పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.