మూసీ ప్రక్షాళన అంచనా ముందు రూ. 50 కోట్లు అయింది. ఆ తరువాత రూ. 70 కోట్లకు చేరింది. మళ్లీ ఇప్పుడు ఏకంగా రూ.లక్షా 50 వేల కోట్లకు ఎందుకు పెరిగిందని కేటీఆర్ ప్రశ్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: మూసీ ప్రక్షాళన చేపట్టనున్నట్లు తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ ప్రకటనపై పూటకో మాట మారుస్తోందని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఇప్పటికే రూ.3,866 కోట్లతో మూసీలో వంద శాతం సివరేజ్ ట్రీట్మెంట్ చేశామని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కొత్తగా చేయడానికి ఏం మిగిలి లేదని ఆయన వెల్లడించారు.
గతంలో BRS అధికారంలో ఉండగా.. సివరేజ్ ట్రీట్మెంట్ పూర్తి చేసిన తరువాత రూ. 16 వేల కోట్ల అంచనాతో మొత్తం డిజైన్స్ కూడా తయారు చేసి ఫైనల్ చేశామని కేటీఆర్ అన్నారు. ఇప్పుడేమో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కరూ ఒక్కో మాట చెప్తున్నారు. వీళ్ల వైఖరి చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని కేటీఆర్ అన్నారు. BRS హయాంలో మూసీపై ఎక్స్‌ప్రెస్ వే, బ్యూటిఫికేషన్‌తో కలిపి రూ.16 వేల కోట్లతో అంచనా వేసినట్లు తెలిపారు.
కానీ, మూసీ ప్రక్షాళన అంచనా ముందు రూ. 50 కోట్లు అయింది. ఆ తరువాత రూ. 70 కోట్లకు చేరింది. మళ్లీ ఇప్పుడు ఏకంగా రూ.లక్షా 50 వేల కోట్లకు ఎందుకు పెరిగిందని కేటీఆర్ ప్రశ్నించారు. దీని కోసం ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి.. ప్రజల సొమ్ము అని ఆయన గుర్తుచేశారు. దీనిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు.