న్యూస్ లైన్ డెస్క్ : పేద పిల్లలు చదువుకునేందుకు పెట్టిన గురుకులాలు ఇప్పుడు కమర్షియల్‌గా మారుతున్నాయట. పైసలిస్తేనే సీట్లు దొరికే పరిస్థితి వచ్చిందట. ఒకప్పుడు మంచిగా చదువుకునేవాళ్లకు, పేదలకు అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు గురుకులం సీట్లను అంగట్లో పెట్టి అమ్మకాలు జరుపుతున్నారనే ఆరోపణలు చాలా వినిపిస్తున్నాయి. ఏకంగా కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించిన పీఏలు దగ్గరుండి మరీ సీట్లకు బేరాలు కుదుర్చుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గురుకులాల్లోనూ ఏరియాను బట్టి, అక్కడి సౌకర్యాలను బట్టి ఒక్కో రేట్ పెట్టారట. తక్కువలో తక్కువగా రూ.20వేల నుంచి రూ.40వేల వరకు అమ్ముతున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇందులో బేరాలు చేసే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదట. పైగా ఉచిత సలహాలు ఇస్తున్నారట. ఒక్క సంవత్సరం ప్రైవేట్ స్కూల్ ఫీజు కడితే ఇంటర్ వరకు ఫ్రీగా చదువుకోవచ్చని చెబుతున్నారట. ఓ వైపు ప్రైవేట్ స్కూళ్ల ఫీజు దోపిడీ తట్టుకోలేక, అటూ సర్కార్ బడిలో చదువు బాగా చెప్పడం లేదనే అసంతృప్తితో పేదలు సైతం అప్పు తెచ్చి మరీ సీట్లు కొంటున్నారట.
అసిఫాబాద్ లోని బీసీ గురుకులం, మైనార్టీ గురుకులంలో సీట్లు ఇప్పిస్తానని మంత్రి సీతక్క పీఏగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి పేదల నుంచి డబ్బులు తీసుకున్నాడట. ఒక్కో సీటుకు రూ.20వేలు తీసుకున్నట్లు సమాచారం. నమ్మిన ఓ కుటుంబం డబ్బులు ఇచ్చినా సీటు రాలేదని తెలుస్తోంది. సదరు వ్యక్తిని నిలదీస్తే త్వరలోనే సీటు వస్తుందని నమ్మబలుకుతున్నాడట. ఇదే జిల్లాలో మైనార్టీ స్కూళ్లలో సీటు ఇప్పించేందుకు ఓ వ్యక్తి ఏకంగా ఒక్కో సీటుకు రూ.40వేల చెప్పున తీసుకున్నాడట. అయితే పిల్లలు గురుకులంలో ఉండమని మారాం చేయడంతో పేరెంట్స్ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరితే నిరాకరించడంతో వాళ్లు విజిలెన్స్ అధికారులను సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేల్ గురుకులంలోనూ సీట్ల దందా జరుగుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మిగిలిన ఉన్న సీట్లకు అక్కడి సిబ్బంది పేరు చెప్పి సీట్ల కోసం వచ్చే వారితో బేరాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. డబ్బులు ఇచ్చినవారికి సీట్లు కేటాయిస్తుందనే తెలుస్తోంది. ఎగ్జామ్ పేరుతో సెలెక్ట్ చేస్తున్నామని బయటకు చెబుతున్నప్పటికీ చేతులు తడిపినవారిని పాస్ చేయిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. గురుకులాల్లో పేదలకు సీట్లు అమ్ముకుంటున్నా పట్టించుకునేనాథుడు కరువయ్యారని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారట. తమ బాధ ఎవరికీ చెప్పాలో కూడా అర్థం కావడం లేదని వాపోతున్నారట. ఇక్కడ కూడా దళారుల రాజ్యమే నడిస్తే పేదలు చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. స్పెషల్ ఫోకస్ పెట్టి ఇలాంటి దందాలు, అమ్మకాలు ఆపేలా చూడాలని కోరుతున్నారు.