Snake Bite : దేవతనుకొని పూజిస్తే.. ఉసురు తీసిన పాము

వత అనుకొని భక్తితో 20 ఏళ్లుగా పూజలు చేసింది. వారంలో ఒకరోజు భక్తి ప్రపత్తులతో ఉపావాసాలు పాటించింది. కానీ.. దేవత అని పూజలు పొందిన ఆ పామే.. ఆమె పాలిట కాలసర్పం అయింది.


Published Jul 31, 2024 05:58:43 AM
postImages/2024-07-31/1722423508_Snake.jpg

 

న్యూస్ లైన్ డెస్క్ : దేవత అనుకొని భక్తితో 20 ఏళ్లుగా పూజలు చేసింది. వారంలో ఒకరోజు భక్తి ప్రపత్తులతో ఉపావాసాలు పాటించింది. కానీ.. దేవత అని పూజలు పొందిన ఆ పామే.. ఆమె పాలిట కాలసర్పం అయింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని గోసంపల్లిలో గంగవ్వ అనే వృద్ధురాలు 20 ఏళ్లుగా పామును ఎల్లమ్మగా భావించి పూజలు చేస్తోంది. ఆయాగా పనిచేసి రిటైర్ అయిన గంగవ్వను ఆమె చేతే పూజలందుకున్న పాము కాటు వేసి బలి తీసుకుంది. గోసంపల్లెలో అంగన్ వాడీలో ఆయాగా పనిచేసిన గంగవ్వ ఈ నెల 1 తారీఖు నాడు రిటైర్ అయింది. అయితే.. 20 ఏళ్ల క్రితం గంగవ్వ ఇంట్లో ఓ పుట్ట వెలిసింది. ఆ పుట్టలో ఓ పాము ఉంటోంది. దీంతో నిత్యం గంగవ్వ ఇల్లు శుద్ధి చేసి పూజలు చేస్తూ వచ్చింది. ఎప్పటిలాగే మంగళవారం (నిన్న) నాడు కూడా ఉదయం నిద్రలేచి పూజ చేసేందుకు ఇల్లు అలికేందుకు సిద్ధపడింది. ఆ సమయంలోనే పుట్టలోంచి బయటకు వచ్చిన పాము గంగవ్వను చేతిపై కాటు వేసింది.

పామును దైవంగా భావించిన గంగవ్వ తనకేం కాదని అంతా దైవమే చూసుకుంటుందని పనుల్లో మునిగిపోయింది. వంట పనులు చేసుకుంటున్న గంగవ్వ దగ్గరికి వచ్చిన నాగుపాము మరోసారి కాటేసింది.  రెండుసార్లు పాము కాటేయడంతో అనుమానం వచ్చిన గంగవ్వ చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చింది. అప్రమత్తమైన స్థానికులు వైద్యం చేయమని స్థానిక నాటు వైద్యుడిని కోరగా.. పరిస్థితి విషమించిందని అతడు నిరాకరించాడు. దీంతో.. హుటాహుటిన గంగవ్వను ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. అయితే.. అప్పటికే పరిస్థితి చేయి దాటడంతో గంగవ్వ ప్రాణాలు కోల్పోయింది. అయితే.. పాము మాత్రం ఆ పుట్టను వదిలి వెళ్లకుండా అదే పుట్టలో ఉండటంతో కుటుంబ సభ్యుల కోరిక మేరకు పాముకు ఎలాంటి హాని జరగకుండా బంధించి సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news crime- crime snakes

Related Articles