Mehfil: బిర్యానీలో సేఫ్టీ పిన్.. ఖంగుతిన్న కస్టమర్..! 2024-06-29 18:52:16

న్యూస్ లైన్ డెస్క్: ఆన్‌లైన్(online)లో ఆర్డర్ చేసిన ఆహార పదార్దాల్లో జెర్రీ, బల్లి వంటివి వచ్చిన వార్తలు ఇటీవల చాలానే చూశాం. మరోవైపు హైదరాబాద్(hyderabad)లోని పలు ఫేమస్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ(food safety) అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నాసి రకం సరుకులు, కుళ్లిపోయిన కూరగాయలు, కాలం చెల్లిన నూనెలు, కుళ్లిపోయిన మాంసం వాడి వంటలు చేసి కస్టమర్లకు పెడుతున్న సందర్బాలు కూడా చూశాం. 

వీకెండ్ వచ్చిందంటే చాలు.. బయట షికార్లకు వెళ్లి రెస్టారెంట్ల(restaurants)లో భోజనం చేసే వారిని హెచ్చరిస్తూ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నో ఉదాహరణలు చూపించారు. అయినప్పటికీ నగర వాసులు బయట దొరికే ఆహారాన్ని తినడం మానుకోవడం లేదు. ఇది ఇలా ఉంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకొని తెప్పించుకునే ఆహారం కూడా ఈ రకంగానే ఉంటుంది. మొన్నటికి మొన్న.. ఆర్డర్ చేసిన  బిర్యానీ(biryani)లో తల వెంట్రుకలు వచ్చాయని ఓ కస్టమర్ ఫుడ్ డెలివరీ సంస్థకు ఫిర్యాదు చేశాడు. ఇది మరువక ముందే తాజగా మరో సంఘటన చోటుచేసుకుంది. 

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన బిర్యానీలో ఈ సారి సేఫ్టీ పిన్(safety pin) దర్శనమిచ్చింది. హైదరాబాద్ మణికొండలోని మెహ్ఫిల్(Mehfil) రెస్టారెంట్ వారు డెలివరీ చేసిన బిర్యానిలో సేఫ్టీ పిన్ రావడంతో షాక్ అయ్యానని ఆ కస్టమర్ తెలిపాడు. తినే ఆహారాన్ని ఎంతో నమ్మి ఆర్డర్ చేసుకుంటే.. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిచం సరికాదని రెస్టారెంట్ పట్ల ఆ కస్టమర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.