వాతావరణ శాఖ (IMD) మరియు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)లను సంప్రదించి దీనికి సంబంధించిన కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: వర్షాల నుంచి తేరుకొని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో తెలంగాణలో సుడిగాలులు అల్లకల్లోలం సృష్టించాయి. ములుగు జిల్లా అడవుల్లో పెద్ద సుడిగాలి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఒకేచోట వందలాది చెట్లు నేలమట్టమయ్యాయి. మేడారం-తాడ్వాయి మధ్య ఉన్న రిజర్వ్ ఫారెస్టులో 3 కిలోమీటర్ల మేర భారీ వృక్షాలు కూలిపోయాయి.
ఏటూరునాగారం అడవుల్లో దాదాపు 200 హెక్టార్లలో 5 వేల చెట్లు కూలిపోయాయి. కూలిపోయిన చెట్లలో నల్లమద్ది, తెల్లమద్ది, ఎగిస, జువ్వి, నారెప, మారేడు, నేరేడు, ఇప్ప వంటి జాతులకు చెందినవి ఉన్నట్లు తెలుస్తోంది. టొర్నాడో లేదా సుడిగాలి కారణంగా చెట్లు కూలిపోయి ఉంటాయని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. వాతావరణ శాఖ (IMD) మరియు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)లను సంప్రదించి దీనికి సంబంధించిన కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
తాజగా, ఈ అంశంపై మంత్రి సీతక్క కూడా స్పందించారు. ములుగులో 500 ఎకరాల్లో లక్ష చెట్లు నేలకొరిగాయని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఘటనపై పరిశోధనలు చేయించాలని కోరారు. అటవీ ప్రాంతంలో చెట్లు పెంచడానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సుడిగాలి గ్రామాల్లో సంభవించి ఉంటే పెను విధ్వంసం జరిగేదని అన్నారు.