Srilanka Minster: తెలంగాణను పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చింది కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్‌తో శ్రీలంక వాణిజ్య, పర్యావరణ శాఖల మంత్రి సతాశివన్ వియలేందిరన్‌ సోమవారం సమావేశమైయారు.


Published Aug 19, 2024 03:56:02 PM
postImages/2024-08-19/1724063162_srilankaminster.PNG

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్‌తో శ్రీలంక వాణిజ్య, పర్యావరణ శాఖల మంత్రి సతాశివన్ వియలేందిరన్‌ సోమవారం సమావేశమైయారు. 2014లో భారతదేశంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేవలం పదేళ్ల కాలంలోనే సాధించిన అద్భుత ప్రగతి గురించి.. గతంలో తాను శ్రీలంక పార్లమెంట్‌లో ప్రస్తావించినట్టు ఈ సందర్భంగా కేటిఆర్‌కు సతాశివన్ తెలిపారు. హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల అభివృద్ధిని చూస్తే.. సింగపూర్‌ను తలపించేలా ఉందని శ్రీలంక మంత్రి  ప్రశంసించారు. ఐటీ, పరిశ్రమల మంత్రిగా కేటిఆర్ తెలంగాణను పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చిన తీరును ఆయన అభినందించారు.

ఓవైపు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంటే.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌ను అవకాశాల అక్షయపాత్రగా మార్చిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణలో ఓవైపు ఐటీ, ఇంకోవైపు మ్యానుఫ్యాక్చరింగ్, మరోవైపు ఫార్మా రంగాలకు ఏకకాలంలో పెద్దపీట వేసి పారిశ్రామిక రంగాన్ని మెరుపువేగంతో పరుగులు పెట్టించడం అరుదైన విషయమని సతాశివన్ తెలిపారు. హైదరాబాద్ వంటి నగరాలే ఏ దేశానికైనా ఆర్థిక ఇంజన్లని, వీటిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉంటుందని  పేర్కొన్నారు. 

ఓసారి తాను చెన్నైలో పర్యటిస్తున్న సందర్భంలో అక్కడి పోలీసు అధికారితో మాట్లాడానని, తమిళనాడు కంటే.. తెలంగాణ పోలీసులకే ఎక్కువ వేతనాలు అందుతున్నాయనే విషయాన్ని అతను చెప్పారని సతాశివన్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా  కేటిఆర్ మాట్లాడుతూ.. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో సాధించిన తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లపాలనను ఓ యజ్ఞంలా సాగించామని, అందుకే అనతికాలంలోనే అసాధారణ ఫలితాలు సాధించగలిగామని వెల్లడించారు. తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్‌లో సంపదను సృష్టించి సంక్షేమం రూపంలో పల్లెపల్లెనా పేదలకు పంచామని కేటిఆర్ తెలిపారు. పారిశ్రామిక రంగానికేకాదు.. పర్యావరణానికి కూడా సమప్రాధాన్యం ఇచ్చామని, తెలంగాణలో 7.7 శాతం గ్రీన్ కవర్‌ను పెంచడం దేశంలోనే అరుదైన రికార్డు అని గుర్తుచేశారు. తెలంగాణకు హరితహారం పేరిట చేపట్టిన కార్యక్రమం మానవ చరిత్రలోనే మూడో అతిపెద్ద ప్రయత్నమని వెల్లడించారు. చిన్న వయసులోనే శ్రీలంక ఎంపీగా, కేంద్రమంత్రిగా ఎదగడంపట్ల అభినందనలు తెలిపి.. సతాశివన్‌ను శాలువతో సత్కరించి జ్ఞాపికను కేటీఆర్ అందజేశారు.
 

newsline-whatsapp-channel
Tags : india-people hyderabad mla brs ktr minister srilanka

Related Articles