న్యూస్ లైన్ డెస్క్ : మరికొన్ని రోజుల్లో జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జార్ఖండ్ మాజీసీఎం, జార్ఖండ్ ముక్తిమోర్చా నేత చంపై సోరెన్ బీజేపీలో చేరుతున్నట్టు వార్తలొచ్చాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో చంపై సోరెన్ బీజేపీలో చేరనున్నారన్న వార్తలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి.
చంపైతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారనున్నారని వార్తలొచ్చాయి. ఇదే సమయంలో ఆయన ఢిల్లీలో కనిపించడం పట్ల వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. అయితే.. తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల పట్ల చంపై సోరెన్ స్పందించారు. ఢిల్లీలో ఎవరినీ కలవలేదని.. బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు నిజం కాదని చంపై ప్రకటించారు. ఢిల్లీకి తన వ్యక్తిగత పని కోసం వచ్చానని.. పనిలో పనిగా పిల్లలను చూసి వెళ్తున్నానని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నానో.. జీవితాంతం అక్కడే ఉంటానని చంపైన్ తెలిపారు.