న్యూస్ లైన్ డెస్క్ : తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, తెలంగాణవాది కొణతం దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న దిలీప్ ను రేవంత్ సర్కార్ టార్గెట్ చేసింది. ఆరు నెలలుగా కొణతం దిలీప్ ను ప్రభుత్వం రకరకాలుగా వేధిస్తోంది.
గతంలో దిలీప్ మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే హైకోర్టు కల్పించుకొని ప్రభుత్వాన్ని మందలించింది. దిలీప్ ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయితే.. తాజాగా మరోసారి దిలీప్ ను ఎలాంటి కారణాలు చూపకుండా పోలసులు బలవంతంగా తీసుకెళ్లారు. సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలున్నాయని.. మిగతా వివరాలేవీ అడగొద్దని దిలీప్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలు, ఎఫ్ఐఆర్ పై పోలీసులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాగా.. దిలీప్ అరెస్టుపై బీఆర్ఎస్ స్పందించింది. ప్రజాపాలన పేరుతో ప్రశ్నించిన గొంతులను నొక్కేయడం సరికాదంటూ మండిపడింది. దిలీప్ కొణతంను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేసింది.