న్యూస్ లైన్ డెస్క్ : మా పంటలను, మా ఊర్లను, మా బతుకులను ముంచేసే ఫార్మాసిటీ మాకొద్దు అంటూ వేలాదిమంది రైతులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలంలో నిర్మించనున్న ఫార్మాసిటీకి వ్యతిరేకంగా వేలాది మంది రైతులు కదిలివచ్చారు. స్థల పరిశీలనకు వచ్చిన అధికారులను అడుగు ముందుకు పడకుండా చుట్టుముట్టి అడ్డుకున్నారు. డప్పూర్ – బీదర్ రోడ్డుపై బైఠాయించి 4 గంటల పాటు అధికారుల కార్లను కదలనివ్వలేదు. సీఎం డౌన్ డౌన్.. కలెక్టర్ డౌన్ డౌన్.. ఫార్మాసిటీ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
వ్యవసాయం చేసుకొని బతికే తమ భూములు లాక్కుంటే ఎలా బతకాలంటూ డప్పూర్, మల్కి, వడ్డీ గ్రామాల రైతులు అధికారులను నిలదీశారు. మా భూములు పనికిరానివంటూ ఎలా నివేదిక ఇస్తారంటూ ప్రశ్నించారు. ఫార్మాసిటీ కోసం భూములను పరిశీలిచేందుకు వచ్చిన అదనపు కలెక్టర్ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, ఆర్డీవో రాజు ఇతర అధికారులను అడుగు ముందుకు కదలనివ్వలేదు. దీంతో చేసేదేం లేక అధికారులు కారులోనే కూర్చుండిపోయారు. డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి రైతులతో చర్చలు జరిపినప్పటికీ వారు శాంతించలేదు. మా భూముల జోలికి రామని కలెక్టర్ హామీ పత్రం రాసిస్తేనే ఆందోళన విరమిస్తామని పట్టుపట్టి కూర్చున్నారు.