AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్  2024-06-26 05:57:26

న్యూస్ లైన్ డెస్క్: మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బుధవారం పల్నాడు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్ ఇంట్లో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈవీఎంల ధ్వంసం చేసి అడ్డుకున్న వారిపై దాడి చేసిన కేసుల్లో అరెస్ట్ చేసి నర్సరావుపేట ఎస్పీ కార్యాలయానికి తరలించారు. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసంతోపాటు రెండు హత్యాయత్నం కేసులు ఉన్నాయి. ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో టీడీపీ ఏజెంట్‌పై దాడి చేసిన ఘటనలో పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. కారంపూడిలో దాడి కేసులో సీఐ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పిన్నెల్లి బ్రదర్స్‌పై పోలీసులు మరో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈవీఎంల ధ్వంసం, ఎన్నికల్లో అల్లర్లు ఘటనల్లో పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పిన్నెల్లి తరఫు న్యాయవాదులు బుధవారం అప్పీల్‌కు వెళ్లారు. కాగ, కోర్టులో జరిగిన వాదనల్లో ఏపీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ పిన్నెల్లి వేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లను కొట్టి వేసింది. దాంతో పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లితో పాటుగా అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.