T20 Worldcup: టాస్ గెలిచిన భారత్.. సఫారీతో ఫైనల్ ఫైట్ 2024-06-29 19:56:34

న్యూస్ లైన్ స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్ ఆఖరి అంకం చేరుకుంది. ఈ మెగా టోర్నీలో అజేయంగా దూసుకెళ్లిన టీమిండియా, సఫారీలు ఫైనల్ ఫైట్కు సిద్ధమవుతున్నారు. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ సౌతాఫ్రికా పోరులో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐసీసీ టోర్నీల్లో సౌతాఫ్రికాకు ఇది తొలి ఫైనల్ కాగా భారత్కు ఇది 13వ టైటిల్ పోరు. క్రికెట్ చరిత్రలో తొలిసారి ‘సెమీస్ గండం’ గట్టెక్కిన సఫారీ జట్టు ఐసీసీ ట్రోఫీ కలను నిజం చేసుకోవాలనే కసితో ఉంది. మరోవైపు టీ20 ట్రోఫీని ముద్దాడాలని రోహిత్ సేన పట్టుదలతో కనిపిస్తోంది. దాంతో, ఈసారి టైటిల్ ఎవరిని వరిస్తుంది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీ20 ప్రపంచ కప్ 9వ ఎడిషన్లో భారత్, సఫారీలు అద్భుతంగా రాణించారు. ఒకరకంగా ఐసీసీ టోర్నీ హిస్టరీలో ఇదొక కొత్త అధ్యాయమనే చెప్పాలి. ఈ మెగా టోర్నీలో ఫేవరెట్ ట్యాగ్ను నిలబెట్టుకుంటూ టాప్ షోతో ప్రత్యర్థులను వణికించాయి. రెండు జట్లలో ఆటగాళ్లు మంచి ప్రదర్శనతో రాణిస్తున్నారు. ఇక కెప్టెన్సీ విషయానికొస్తే ఎడెన్ మర్క్రమ్ ఒత్తిడిలోనూ కూల్గా ఉంటున్నాడు. రోహిత్ శర్మ అయితే.. ప్రశాంతంగా ఉంటూనే పరుగుల వరద పారిస్తూ తనదైన వ్యూహాలతో జట్టును గెలుపు బాటలో నడిపిస్తున్నాడు. ఓటమెరుగని ఈ రెండు జట్ల మధ్య ఫైన్లను ‘సమఉజ్జీల యుద్ధ’ మని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. 

 

జట్టు వివరాలు 

 

టీమిండియా జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.

 

సౌతాఫ్రికా జట్టు : క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఎడెన్ మర్క్రమ్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్జి, ఒట్నిల్ బార్ట్మన్