సర్వోన్నత న్యాయస్థానానికి దురుద్దేశాలను ఆపాదించడం సరికాదని న్యాయమూర్తులు తెలిపారు. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టుకి గౌరవం ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: BRS ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై సుప్రీంకోర్టు తీర్పును ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై సుప్రీం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పుపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రేవంత్‌కు ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది.
సర్వోన్నత న్యాయస్థానానికి దురుద్దేశాలను ఆపాదించడం సరికాదని న్యాయమూర్తులు తెలిపారు. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టుకి గౌరవం ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఇటువంటి వ్యాఖ్యలు మళ్లీ చేయకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డికి కౌన్సెలింగ్ ఇవ్వాలని రేవంత్ తరపు లాయర్లకు సూచించారు.
తాజాగా, ఈ అంశంపై స్పందించిన రేవంత్ రెడ్డి.. సుప్రీంకు క్షమాపణ చెప్పారు. భారత న్యాయవ్యవస్థపై తనకు గౌరవం, పూర్తి విశ్వాసం ఉందంటూ ట్వీట్ చేశారు. గురువారం వచ్చిన పలు వార్తపేపర్లను చూశాక.. సుప్రీం తీర్పునే ప్రశ్నించాననే అభిప్రాయం వచ్చేలా చేశానని తనకు అర్ధమైందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. న్యూస్ పేపర్లలో వచ్చిన వార్తలకు విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. న్యాయవ్యవస్థపైనా, ఆ వ్యవస్థ స్వతంత్రతపైనా తనకు అత్యంత నమ్మకం ఉందని సీఎం రేవంత్ ఈ ట్వీట్‌లో తెలిపారు.