తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మరణించారు
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మరణించారు. త కొంతకాలంగా జిట్టా బాలకృష్ణ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, శుక్రవారం ఉదయం పరిస్థితి విషమించి ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. భువనగిరి ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో జిట్టా కీలక పాత్ర పోషించారు. యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షునిగా కూడా ఆయన పనిచేశారు. 2009లో భువనగిరి అసెంబ్లీ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక యువ తెలంగాణ పార్టీ స్థాపించి తర్వాత బీజేపీలో జిట్టా బాలకృష్ణ రెడ్డి విలీనం చేశారు.
జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి పట్ల బీఆర్‌ఎస్ నాయకుడు రాకేశ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఉద్యమ కెరటం, ఎంతో మందికి ఆపదలో అండగా నిలిచిన ఆపత్బాంధవుడు, భువనగిరిలో ఎంతో మంది యువ నాయకులను తయారు చేసిన స్ఫూర్తిదాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి మరణం ఎంతో విషాదాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధి అయ్యే అవకాశం రాకపోయినా ప్రజల ఆమోదం పొందిన నాయకుడు, ప్రజల అభిమానం సొంతం చేసుకున్న నాయకుడు జిట్టా అన్నారు. రాజకీయాల్లో ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారని తెలిపారు. ప్రజాప్రతినిధి కావాలన్న తన ఆశ దురదృష్టవశాత్తు నెరవేరకపోయినా అంతకంటే గొప్ప పేరును సంపాదించుకున్నారని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు ఈ విషాద వార్తను ఎదుర్కొని నిలబడే శక్తిని అందించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను అని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు.