కాలువలో పడి ఓ విద్యార్ధి మృతి చెందాడు. దాంతో ఉపాద్యాయురాలిని గదిలో బంధించి గ్రామస్తుల ఆందోళన చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: కాలువలో పడి ఓ విద్యార్ధి మృతి చెందాడు. దాంతో ఉపాద్యాయురాలిని గదిలో బంధించి గ్రామస్తులు ఆందోళన చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని ఆర్లపెంట గ్రామంలో చోటు చేసుకుంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆదే గ్రామానికి చెందిన తోలెం వరుణ్ (7) రెండవ తరగతి చదువుతున్నాడు. ఇంటర్వెల్ సమయంలో మరో ఇద్దరు విద్యార్ధులతో కలసి పాఠశాల వెనక వున్న నీటి వాగులో ఆడుకుని బట్టలను తడుపుకున్నాడు. బట్టలు తడిగా వుండటంతో ఉపాద్యాయురాలు ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకుని రావాలని ముగ్గురిని ఇంటికి పంపింది. వీరు ఇంటికి వెళ్లకుండా గ్రామ శివారులోని సీతారామా ప్రాజెక్టు కాలువలోని నిల్వ నీటిలో ఆడుకోవడానికి వెళ్లారు.
ప్రమాదవశాత్తు వరుణ్ నీటిలో మునిగి పోవడాన్ని గమనించిన తోటి ఇద్దరు విద్యార్ధులు భయంతో ఇంటికి పారిపోయారు. అటుగా నడిచి వస్తున్న గ్రామానికి చెందిన బాలరాజు అనే రైతు వరుణ్ ని కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందాడు. దీంతో గ్రామస్తులు తల్లిదండ్రులతో కలసి పాఠశాల వద్దకు వచ్చి వరుణ్ మృతికి ఉపాద్యాయురాలి నిర్లక్ష్యమే కారణమని ఆమెను గదిలో బంధించి పాల్వంచ రోడ్డుపై రాస్తారోకో చేసారు. పోలీసులు వంటనే ఉపాద్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.