పార్లమెంటులో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ విదేశీ సంస్ధ హిండెన్‌బర్గ్‌కు మౌత్ పీసుగా మారడం, ఆ పార్టీ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనం అని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: పార్లమెంటులో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ విదేశీ సంస్ధ హిండెన్‌బర్గ్‌కు మౌత్ పీసుగా మారడం, ఆ పార్టీ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనం అని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. భారత ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న అమెరికన్ షార్ట్ సెల్లింగ్, మార్కెట్ రీసెర్చ్ కంపెనీ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సెబీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర మంత్రులు డిమాండ్ చేయడం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం అన్నారు. దేశ ఆర్ధిక ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్న విదేశీ కంపెనీ హిండెన్‌బర్గ్ కు వత్తాసు పలుకుతున్నందుకు కాంగ్రెస్ పెద్దలంతా ఓసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు.
అమెరికన్ షార్ట్ సెల్లింగ్, మార్కెట్ రీసెర్చ్ కంపెనీ హిండెన్‌బర్గ్ భారత ఆర్ధిక వ్యవస్ధను అస్ధిరపరచాలని చూస్తోందన్నారు. గత 2023 ఏడాది మొదట్లో కూడా హిండెన్ బర్గ్ ఇప్పటిలాగే భారత ఆర్ధిక వ్యవస్ధను టార్గెట్ చేసుకుని ఓ నివేదికను విడుదల చేసింది. దాని ఆధారంగా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో కూడా రాజకీయం చేయాలని చూసి భంగపడిందని అన్నారు. అయినా కాంగ్రెస్ పెద్దల బుద్ధి మారలేదని విమర్శించారు. ఇపుడు తాజగా హిండెన్‌బర్గ్ కంపెనీ, భారత ఆర్ధికరంగంలో కీలక సంస్ధ అయిన సెబీపై ఇచ్చిన నివేదిక ఆధారంగా మరోసారి రాజకీయం చేయడం విదేశీ శక్తుల కుట్రలకు వత్తాసు పలకడమే అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పురోగమిస్తున్న దేశ ఆర్ధిక వ్యవస్ధను అస్ధిర పరచాలని విదేశీ శక్తులు కొన్నేళ్లుగా పనిచేస్తున్నాయి. ఆ కోవకు చెందిందే అమెరికన్ షార్ట్ సెల్లింగ్, మార్కెట్ రీసెర్చ్ కంపెనీ హిండెన్‌బర్గ్ అన్నారు. అలాంటి కంపెనీ ఇచ్చిన ఓ నివేదికను పట్టుకుని దేశ ఆర్ధిక వ్యవస్ధను గందరగోళపరిచేలా కాంగ్రెస్ రాజకీయ రచ్చ చేస్తుండడం ముమ్మాటికీ దేశద్రోహమే అని ఆయన అన్నారు. ఓ అమెరికా కంపెనీ ఇచ్చిన నివేదికకు కాంగ్రెస్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దేశవ్యాప్తంగా రాజకీయం చేస్తోందంటే, అసలు ఆ నివేదిక రూపకల్పనకు సహకరించిందే హస్తం పార్టీ అనే అనుమానాలు వస్తున్నాయి అన్నారు.
సెబీ సంస్ధపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక ఏ విధంగా ప్రామాణికమో దేశ ప్రజలకు కాంగ్రెస్ వివరించాలని డిమాండ్ చేశారు. ఓ విదేశీ కంపెనీని నమ్ముకుని కాంగ్రెస్ రాజకీయం చేయడం, సెబీ వ్యవహారంపై జెపీసీ ఏర్పాటు చేయాలనడం దేశానికి ఏ విధంగాను ప్రయోజనం కాదన్నారు. ఇది దేశీయ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేవారిని అయోమయానికి గురి చేస్తుందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న రాజకీయం ముమ్మాటికీ దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేదే అన్నారు. జన్మతా విదేశీయురాలైన సోనియా గాంధీ, ఆమె కుమారుడైన రాహుల్ గాంధీ కూడా ఇండియన్ హెరాల్డ్ కేసులో బెయిల్ పై ఉన్నారని గుర్తు చేశారు. పదేళ్లకు పైగా అధికారానికి దూరమైన గాంధీ కుటుంబానికి ఇక కనుచూపు మేరలో అధికారం వస్తుందన్న నమ్మకం లేకపోవడంతోనే.. ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న గుడ్డి వ్యతిరేకతతో ఇలా హిండెన్ బర్గ్ వంటి విదేశీ సంస్ధలను నమ్ముకుని, కాంగ్రెస్ విదేశీ శక్తులకు ఏజెంటుగా మారిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి ఏలేటి పేర్కొన్నారు.