రాష్ట్రంలో పాల రైతులు పరేషాన్లో ఉన్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో పాల రైతులు పరేషాన్లో ఉన్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో పాడి పంటలు అనేవారు.. ఇప్పుడు పాడి, పంట వేర్వేరు అయ్యాయి అన్నారు. రైతుకు వ్యవసాయానికి పాడి తోడయ్యేదని, రాష్ట్రంలో నాలుగు నెలలైనా పాడి రైతులు పాలు పోస్తున్నా డైరీ డబ్బులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో 30 లక్షల లీటర్ల పాలు ప్రతి రోజూ వినియోగిస్తారు. ఐదు లక్షల లీటర్లు తెలంగాణ నుంచి వస్తాయి, ఈ ఐదు లక్షల లీటర్లకు కూడా పాడి రైతులకు డబ్బులు చెల్లించడం లేదన్నారు. మిగతా 25 లక్షల లీటర్ల పాలు ఎక్కడ్నుంచి వస్తున్నాయి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ డైరీని బొంద పెట్టి ఆంధ్రా డైరీలను పెంచి పోషించే కుట్ర జరుగుతుందా అనే అనుమానం వస్తోందన్నారు. కేసీఆర్ హయాంలో పాడి రైతులకు లీటర్కు నాలుగు రూపాయలు ప్రోత్సాహకం ఇచ్చేవారు.. దానాకు డబ్బులు ఇచ్చేవారు అని గుర్తు చేశారు. ఇప్పుడు పాడి రైతులకు వాళ్ళు పోసిన పాలకు డబ్బులు ఇవ్వడం లేదని, విజయ డైరీలో 500 కోట్ల మేర పాల ఉత్పత్తులు నిల్వ ఉన్నాయి అన్నారు. వాటిని కనీసం యాదాద్రి దేవస్థానానికో, తిరుమల వెంకటేశ్వర స్వామి గుడికో విక్రయిస్తే బాగుంటుందని ఆయన తెలిపారు.
హైదరాబాద్లో 30 లక్షల లీటర్ల పాలు అవసరం ఉంటే రైతుల నుంచి ఐదు లక్షల లీటర్లే సేకరిస్తున్నారు. ఈ ఐదు లక్షల లీటర్లలో కూడా కోత పెట్టాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. తెలంగాణ పాడి రైతులను ఖతం చేయాలని కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మొత్తం 30 లక్షల లీటర్ల పాలు ఎవరెవరు సరఫరా చేస్తున్నారో ప్రభుత్వం లెక్కలు చెప్పాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. రైతులు పాడి పరిశ్రమ నుంచి వైదొలిగి వలస కూలీలుగా పొట్ట చేతిన పట్టుకుని వెళ్లే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 50 లక్షల లీటర్ల పాలు తెలంగాణకు అవసరం అవుతాయి.. పాల ఉత్పత్తి పెంచాలి తప్ప తగ్గించకూడదని సూచించారు. పాడి రైతులకు ఇవ్వాల్సిన నాలుగు నెలల బకాయిలు పదిహేను రోజుల్లోగా చెల్లించాలని, లేదంటే పాడి రైతులతో కలిసి ఉద్యమిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నేను పాడి రైతుగా మాట్లాడుతున్నా.. దయచేసి పాడి పరిశ్రమను రాజకీయాలకు తావు ఇవ్వకుండా బతికించండి అని కోరారు. పాల ఉత్పత్తిని తగ్గిస్తే కల్తీ పాలు మార్కెట్లో విచ్చలవిడిగా వస్తాయి అని, ఇప్పటికే కల్తీ పాల విక్రయంపై మీడియాలో కథనాలు వస్తున్నాయి అన్నారు.
కేసీఆర్ హయాంలో పాడి రైతులకు పదిహేను రోజులకు ఓసారి డబ్బులు చెల్లించే విధానం ఉండేదని, అప్పుడు పాల ఉత్పత్తి పెంచమంటే ఇపుడు తగ్గించమంటున్నారని తెలిపారు. ఆంధ్రా డైరీలకు పెద్ద పీట వేసి విజయ డైరీని తొక్కే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణ నుంచి ఐదు లక్షల లీటర్లే పాలు సేకరిస్తున్నప్పుడు మిగతా పాలు దేంతో తయారు చేస్తున్నారో ఆలోచించాలని కోరారు. ఏ రాష్ట్రానికి సరిపడా పాలు అందించే స్థితిలో పాడి రైతులు లేనపుడు ఉత్పత్తి తగ్గించమని ఎలా అంటారు అని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన అంశం.. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు.