Harish Rao: కాంగ్రెస్ హయాంలో గురుకులాలు దిగజారుతుండటం దుర్మార్గం

రాష్ట్రంలోని ఐటీఐ కాలేజీలు, గురుకులాల్లో కనీస వసతులు లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.


Published Aug 13, 2024 02:38:49 PM
postImages/2024-08-13/1723540129_gurukula.PNG

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలోని ఐటీఐ కాలేజీలు, గురుకులాల్లో కనీస వసతులు లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పెద్దపల్లి, సంగారెడ్డి, అదిలాబాద్ ఇలా రాష్ట్రంలో ఎక్కడి ఐటీఐల పరిస్థితి చూసినా అధ్వాన్నంగా ఉన్నాయి అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ లేక, టాయిలెట్స్ లేక, అవసరమైన సిబ్బంది లేక విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లైబ్రరీలో కంప్యూటర్లు, ఇతర మషిన్లు పనిచేయడం లేదని, దీంతో విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయలేకపోతున్నారు. కొన్ని చోట్ల ఐటీఐ తరగతుల్లోకి వాన నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇక గురుకులాల పరిస్థితి నానాటికీ దిగజారుతుందని, కలుషిత ఆహారంతో విద్యార్థుల అస్వస్థత, పాము కాటుకు విద్యార్థి మృతి, డెంగీ జ్వరంతో విద్యార్థి దుర్మరణం వంటి వార్తలు రాష్ట్రంలో నిత్యకృత్యం అయ్యాయి అన్నారు. అత్యధిక ప్రాంగణాలు దోమలు, ఈగలతో మురికి కూపాలుగా ఉన్నాయి. స్నానాల గదులకు డోర్లు కూడా లేని పరిస్థితి. సరిపడా బాత్‌రూంలు లేక ఇబ్బందులు పడుతున్నారు.

మెనూ ప్రకారం భోజనం పెట్టడంలేదు. పెడుతున్న భోజనం కూడా నాణ్యంగా ఉండటం లేదు. దిక్కులేక కారం అన్నంతో కడుపులు నింపుకుంటున్నారు. వాటర్‌ ట్యాంక్స్ మురికితో పాకురు పట్టి ఉంటున్నాయి. ఆ నీటినే విద్యార్థులు స్నానానికి, ఇతర అవసరాలకు వాడుతుండటంతో చర్మవ్యాధుల బారిన పడుతున్నారు. ఇన్ని సమస్యల మధ్య విద్యార్థులు చదువుపై ఎలా దృష్టి సారిస్తారు? గురుకులాల్లో చదివితే విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయం అవుతుందని తల్లిదండ్రులు ఎలా నమ్ముతారు అని ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన గురుకులాలు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దిగజారుతుండటం శోచనీయం అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఐటీఐలు, గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, అవసరమైన అన్ని సౌకర్యాలు వెంటనే కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీష్ రావు డిమాండ్ చేశారు.
 

newsline-whatsapp-channel
Tags : telangana mla brs harish-rao gurukulateacheraspirants

Related Articles