Harish Rao: సర్కారు దవాఖానల్లో మందుల్లేవ్‌.. ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేదు

ప్రభుత్వ దవాఖానాల పనితీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో వైద్యవ్యవస్థను నిద్రావస్థలో ఉంటే.. ప్రజలు అనారోగ్యాలతో అవస్థ తీస్తున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని ఆయన మండిపడ్డారు.


Published Aug 27, 2024 06:31:57 AM
postImages/2024-08-27/1724751324_mgm.PNG

న్యూస్ లైన్ డెస్క్: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు అయిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి కాంగ్రెస్ పాలనలో దిక్కులేకుండా పోయింది. నిత్యం వేలాదిమందికి వైద్యసేవలు అందించే ఆసుపత్రి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది. ఆసుపత్రిలో మందుల కొరత కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మందులు లేవని చేతులెత్తేయడంతో చేసేది లేక రోగులు ప్రైవేటు ఫార్మసీలకు వెళ్తున్నారు. డబ్బులు చెల్లించి మందులు కొనుగోలు చేస్తూ ఆర్థిక భారాన్ని మోస్తున్నారు. మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఎంజీఎం ఆసుపత్రే కాదు దాదాపు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు నిండుకున్నాయి అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం మూడు నెలలకు సరిపడా మందులు బఫర్ స్టాక్ గా పెట్టుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తుందని నిలదీశారు. 

ప్రైవేటు మెడికల్ షాపులకు లాభం చేకూర్చేందుకే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల సరఫరా నిలివేస్తున్నట్లా? ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో ప్రైవేటు ఫార్మసీలను ఎందుకు కొనసాగిస్తున్నట్లు? ఆసుపత్రులకు మందులు సరఫరా చేయాల్సిన టిఎస్ఎంఎస్ఐడీసీ ఏం చేస్తున్నట్లు అని హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రులకు శాపంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజల మన్ననలు పొందిన ప్రభుత్వ ఆసుపత్రులు కాంగ్రెస్ పాలనలో ప్రజల ఆగ్రహానికి గురవుతుందని విమర్శించారు.  ఇప్పటికైనా స్పందించి అన్ని రకాల మందులు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రోగులపై ఆర్థిక భారం పడకుండా చూడాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

newsline-whatsapp-channel
Tags : telangana mla brs congress government-hospital cm-revanth-reddy harish-rao

Related Articles