పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పిచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పిచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నాలుగు వారాల తర్వాత దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల ఎమ్మెల్యే పదవులు ఊడటం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారిన అన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవు.. మొదటి నుంచి ఇదే విషయాన్ని చెబుతున్నామని అన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీ వైఖరి చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
రాజ్యాంగ పరిరక్షణ అంటూనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదని కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశించింది. కాగా, నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా తీసుకుంటామనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.